Weight Loss: ఇవి తిన్నారంటే బరువు తగ్గడం చాలా ఈజీ అంటున్న నిపుణులు
బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో చేర్చుకుని తీసుకున్నారంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు ముందుంటాయి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలని అందించే అద్బుతమైన ఆహారం ఇవి. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తాయి. జీర్ణక్రియకి తోడ్పడతాయి. అంతే కాదు బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు జోడించుకుంటే చాలా మంచిది. 2020లో న్యూట్రియెంట్స్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మొత్తం పండ్లు, కూరగాయలని ఎక్కువగా తీసుకునే మహిళలు ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక బరువు తగ్గడం, స్థూలకాయం బారిన పడే ప్రమాదాన్ని తగ్గించినట్లు తేలింది. అయితే బరువు తగ్గించుకోవాలని అనుకునే వాళ్ళు ఎంచుకోవాలని అనుకునే పండ్లు, కూరగాయల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐదు ఆహారాలు బరువు తగ్గించి, కండరాలని బలోపేతం చేసేందుకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
సిట్రస్ పండ్లు
ద్రాక్ష పండు వంటి సిట్రస్ పండ్లు తీసుకునే వారి బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన ఆహారాల్లో ఒకటిగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. గ్రేప్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి తక్కువ కేలరీలని కలిగి ఉండటంలో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత పొట్ట నిండుగా సంతృప్తిగా ఉంటుంది. నారింగెనిన్ అనే సమ్మేళనం కూడా ఇందులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని తగ్గిస్తుందని జంతువుల మీద జరిపిన అధ్యయనంలో తేలింది.
బెర్రీలు
బాడీ మాస్ ఇండెక్స్ ని తగ్గించడానికి ఉపయోగపడే సూపర్ ఫ్రూట్ బెర్రీలు. ప్రత్యేకించి బ్లూ బెర్రీస్ బరువు తగ్గించడం, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి తక్కువ కేలరీలు కలిగిన ఆహారం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
క్రూసిఫరస్ కూరగాయలు
బ్రకోలి, కాలే, కాలీఫ్లవర్, బ్రసెల్స్ వంటి క్రూసిఫరస్ కూరగాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి. ఇవి క్యాన్సర్ నివారణ ప్రయోజనాలకి ప్రసిద్ధి చెందినవి. వీటిలో తక్కువ కేలరీలు, అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ కూరగాయలలో సైటోకిన్‌లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లు ఉన్నాయి. శరీరంలో మంటని తగ్గించేందుకు సహకరిస్తాయి.
అవకాడో
అధిక కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో ప్రోటీన్, పిండి పదార్థాల కారణంగా బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. అడ్వెంటిస్ట్ హెల్త్ స్టడీ ప్రకారం దాదాపు 55,400 మంది వ్యక్తుల మీద జరిపిన పరిశోధనలో ఎక్కువగా అవకాడో తీసుకున్న వారిలో 15 శాతం, తక్కువగా అవకాడో తీసుకునే వారిలో 7 శాతం అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గించిందని తేలింది. అవోకాడోలు కొవ్వులో అధికంగా ఉన్నప్పటికీ కొవ్వులో ఎక్కువ భాగం మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల శరీర బరువు, నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వుని కరిగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.