Foods That Impact Sleep : టీ, కాఫీలే కాదు.. ఈ ఫుడ్స్ కూడా నిద్రను దూరం చేస్తాయట, మీరు కూడా ఇవి తింటున్నారా?
Sleeping Issues : టీ లేదా కాఫీ మాత్రమే నిద్రకు భంగం కలిగిస్తుందని అనుకుంటున్నారా? కానీ డిన్నర్లోని తీసుకునే కొన్ని ఆహారాలు నిద్రను దూరం చేస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Avoid These Foods before Sleep : టీ, కాఫీలు నిద్రను దూరం చేస్తాయని చెప్తారు. కానీ వాస్తవానికి డిన్నర్ సమయంలో మనం తీసుకునే కొన్ని ఫుడ్స్ కూడా నిద్రను దూరం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. రాత్రుళ్లు నిద్రరాక ఇబ్బంది పడుతున్నారంటే.. మీకు తెలియకుండా కొన్ని ఫుడ్స్ తినేస్తున్నారని అర్థం. ఎందుకంటే రాత్రి భోజనంలో తీసుకునే ఆహారాలు నిద్రకు భంగం కలిగిస్తాయని.. అందుకే ఆ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్ సరీన్.
“మంచి నిద్ర కోసం.. రాత్రి భోజనం తేలికగా, సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనానికి నిద్రపోవడానికి కనీసం 2 గంటల వ్యత్యాసం ఉండాలి. ఎక్కువ మసాలా, చక్కెర, కెఫిన్ కలిగిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.” అని డాక్టర్ నరీన్ తెలిపారు. మరి నిద్రను దూరం చేసే ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.
మసాలా, నూనె ఆహారం
రాత్రిపూట మసాలా, నూనెతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది అసిడిటీ, గుండెల్లో మంటకు కారణమవుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. వేయించిన ఆహారాలు, ఘాటు ఎక్కువగా ఉండే ఫుడ్స్ డిన్నర్ సమయంలో తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు.
స్వీట్స్
డిన్నర్‌లో డెజర్ట్ లేదా స్వీట్ తినడం చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. తరువాత అంతేవేగంగా పడిపోతాయి. దీనివల్ల శరీరంలో అసౌకర్యం ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్‌లో మార్పులు ఉంటాయి. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మీరు డిన్నర్ సమయంలో స్వీట్ తినాలనుకుంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే పడుకోవడానికి రెండు గంటల ముందు తీసుకోవాలి.
చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్
చాక్లెట్‌లో కెఫిన్, థియోబ్రోమైన్ ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి. అదే సమయంలో ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్, చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రుళ్లు వీటిని తీసుకోవడం మంచిది కాదు. నిద్ర కూడా దూరమవుతుంది.
ప్రోటీన్ ఫుడ్స్
చికెన్, రెడ్ మీట్ లేదా ఎక్కువ మొత్తంలో పనీర్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు రాత్రిపూట తినకపోవడమే మంచిది. ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. రిలాక్స్ అయ్యే సమయం ఉండదు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర డిస్టర్బ్ అవుతుంది.
ఆల్కహాల్, కోల్డ్ డ్రింక్స్
ఆల్కహాల్ నిద్రను ఇస్తుందనుకుంటారు కానీ.. ఎక్కువకాలం దీనిని తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. అలాగే కోల్డ్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, షుగర్స్ నిద్రను పాడు చేస్తాయి.
కాబట్టి రాత్రుళ్లు డిన్నర్‌లో ఈ ఆహారాలను తగ్గిస్తే.. మంచి నిద్ర మీ సొంతమవుతుంది. ఉదయం లేచాక తాజా అనుభూతి పొందుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే అవకాశం ఉంది.






















