Coffee: ఈ సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగొద్దు
కాఫీ తాగితే రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే నిద్రలేవగానే చాలా మంది కాఫీ తాగుతారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగకపోవడమే మంచిది.
ఉదయం నిద్రలేవగానే ఎక్కువ మంది చేసే మొదటి పని ఒక కప్పు కాఫీ తాగడం. ఇది తాగితే గాని మనసు ప్రశాంతంగా అనిపించదు. పొద్దున్నే పరగడుపున కాఫీ తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలే కాదు అనార్థాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దశాబ్దాలుగా దీని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కెఫీన్, క్లోరోజెనిక్ యాసిడ్ శరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాని మీద అన్వేషణలు చేస్తున్నారు. 2017లో ప్లాంటా మెడికా జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం రోజుకి 3 నుంచి 4 కప్పులు మితంగా కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కాఫీ పరగడుపున తీసుకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాఫీ జీర్ణక్రియను ఎలా ప్రభావితం చేస్తుంది?
అన్ని రకాల కాఫీలు ఒకేలా ఉండవు. కాఫీ రకాన్ని బట్టి దాని ప్రభావాలు ఉంటాయి. ఇన్ స్టంట్, డికెఫిన్, హాఫ్ కెఫీన్ మొదలైనవి పరిగణలోకి తీసుకుంటారు. అలాగే కాఫీ ఎలా తీసుకుంటున్నారు పాలు, క్రీమ్, చక్కెరతో దేన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా అది ఎలా జీర్ణమవుతుందనేది గమనించాలి.
ఈ సమస్యలున్న వాళ్ళు కాఫీ తాగొద్దు
చాలా మంది పరగడుపున కాఫీ తాగేస్తారు. ఇది కొంతమందికి హాని కలిగించకపోవచ్చు. కానీ మరికొంతమందిలో మాత్రం కడుపులో ఆమ్లం ఉత్పత్తి అయి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. GERD సమస్యతో బాధపడే వాళ్ళు కాఫీ వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అనే దాని మీద పరిశోధనలు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే 2020లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కాఫీ, టీ, సోడా వంటివి తీసుకోవడం వల్ల GERD లక్షణాలు మరింత పెరుగుతున్నాయని గుర్తించారు. పొద్దున్నే కాఫీ తాగిన తర్వాత గుండెల్లో మంట/ GERD లక్షణాలు గమనించినట్లయితే వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఉంటే కాఫీకి దూరంగా ఉండటమే మంచిది.
శరీరంలోకి కెఫీన్ వెళ్ళిన 30 నిమిషాల తర్వాత దాని ప్రభావం చూపుతుంది. ప్లాంటా మెడికా సమీక్ష ప్రకారం కెఫీన్ దాదాపు 45 నిమిషాలలో కడుపు, చిన్న పేగు ద్వారా గ్రహించబడుతుంది. కాఫీ తాగిన వెంటనే పరిస్థితి ఎలా ఉంటుందనేది గమనించుకోవాలి. కొంతమందికి వెంటనే కడుపులో ఇబ్బందిగా అనిపించి బాత్ రూమ్ కి వెళతారు. మరికొంతమందిలో మాత్రం కాఫీ తాగిన తర్వాత ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఎటువంటి హాని జరగకపోవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కాఫీ కంటే ముందుగా ఏదైనా చిరుతిండి తీసుకుని ఆ తర్వాత కాఫీ ఎంచుకుంటే సమస్యలేమీ రావని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి 4 కప్పులకి మించి కాఫీ అసలు తీసుకోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!