Health Warning Signs in Men : మగవారు తరచూ నిర్లక్ష్యం చేసే 10 లక్షణాలు ఇవే.. ఆలస్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు
Men Over 30 Dont Ignore These Warning Signs : మగవారు తమ ఆరోగ్యాన్ని చాలా లైట్ తీసుకుంటారు. కానీ 30 దాటిన తర్వాత శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను విస్మరించవద్దని చెప్తున్నారు వైద్యులు. అవేంటంటే..

- జీవనశైలి వ్యాధుల లక్షణాలు పురుషులు తరచుగా నిర్లక్షిస్తున్నారు, ప్రమాదకరం.
- చాలా వ్యాధులు నిశ్శబ్దంగా పెరిగి, తీవ్ర నష్టం కలిగిస్తాయి.
- అలసట, పొట్ట, తరచు మూత్రవిసర్జన వంటివి నిర్లక్ష్యం వద్దు.
- క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులు మేలు.
Health Symptoms Men Should Take Seriously : గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ వంటి జీవనశైలి వ్యాధులు ఈరోజుల్లో వేగంగా పెరుగుతున్నాయి. అయితే చాలామంది పురుషులు వీటి ప్రారంభ లక్షణాలను వయసు పెరగడం, ఒత్తిడి లేదా బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వచ్చిన సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఈ వ్యాధులు చాలా సందర్భాల్లో సైలెంట్‌గా అభివృద్ధి చెందుతాయని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొన్ని వ్యాధులు తీవ్రమైన నష్టం జరిగే వరకు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చని చెప్తున్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గూడే. కాబట్టి మగవారు కొన్ని లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదుట. వాటిని ముందుగానే గుర్తిస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు, లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
పురుషులు నిర్లక్ష్యం చేసే 10 ముఖ్యమైన లక్షణాలు ఇవే
నిరంతర అలసట : ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే అది మధుమేహం, గుండె జబ్బులు లేదా ఇతర జీవక్రియ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు.
పొట్ట పెరగడం : పొట్ట పెరగడం కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని సూచిస్తుంది.
అధిక దాహం : ఎప్పుడూ నీళ్లు తాగాలనిపించడం లేదా నోరు ఎండిపోవడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిన సంకేతం కావచ్చు.
తరచూ మూత్రవిసర్జన : రాత్రిపూట పదేపదే మూత్రానికి వెళ్లాల్సి వస్తే మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యల సూచన కావచ్చు.
గురక గట్టిగా పెట్టడం : గురకతో పాటు పగటిపూట నిద్రమత్తు, అలసట ఉంటే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణం కావచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఛాతీలో అసౌకర్యం : ఛాతీలో బరువుగా అనిపించడం, నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం వంటి లక్షణాలు గుండె సమస్యలకు సంకేతం కావచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : మెట్లు ఎక్కినప్పుడు లేదా సాధారణ పనులు చేసినప్పుడు ఊపిరి ఆడకపోతే దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
కాళ్లలో వాపు : కాళ్లు, పాదాల్లో వాపు రావడం గుండె, కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో సంబంధం కలిగి ఉండవచ్చు.
అంగస్తంభన సమస్య : ఇది కేవలం లైంగిక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. మధుమేహం లేదా గుండె జబ్బులకు ప్రారంభ సంకేతం కూడా కావచ్చు.
గుండెల్లో మంట, కడుపు సమస్యలు : ఎప్పుడూ గ్యాస్, గుండెల్లో మంట లేదా జీర్ణ సమస్యలు ఉంటే వాటిని సాధారణంగా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఇవే కాకుండా నేటి జీవనశైలిలో వ్యాయామం లేకపోవడం, ఊబకాయం కారణంగా కూడా ఫ్యాటీ లివర్ కేసులు సైలెంట్‌గా పెరుగుతున్నాయని డాక్టర్ దిలీప్ గూడే తెలిపారు. ప్రారంభ దశల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ.. నిరంతర అలసట, కడుపు నొప్పి లేదా లివర్ ఫంక్షన్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మెడికల్ టెస్ట్‌లు చేయించుకోండి..
హైబీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు చూపకుండా ఉండవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మగవారు.. కుటుంబంలో ఈ వ్యాధుల చరిత్ర ఉంటే.. క్రమం తప్పకుండా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, కాలేయ ఆరోగ్యం, బరువు, నడుము చుట్టుకొలత వంటి పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు.
సమస్య తీవ్రం అయ్యే వరకు వేచి చూడకుండా.. లక్షణాలు కొనసాగుతున్నప్పుడు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను కాపాడుకోవచ్చని.. టెస్ట్‌ల రిపోర్ట్‌లకు తగ్గట్లు మెడిసన్స్, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























