(Source: ECI/ABP News/ABP Majha)
UPSC NDA Result: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ-2024 తుది ఫలితాలు విడుదల, ఎంతమంది ఎంపికయ్యారంటే?
UPSC: నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక తుది ఫలితాలను యూపీఎస్సీ వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు 641 మంది ఎంపికయ్యారు.
UPSC NDA & NA EXAMINATION(I), 2024 – FINAL RESULTS: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ)1-2024 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అక్టోబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ బోర్డు నిర్వహించిన ఇంటర్వ్యూల తర్వాత మొత్తం 641 మంది అభ్యర్థులు మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికయ్యారు. మొత్తం 404 ఖాళీలకు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఖాళీల భర్తీకి ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 9న విడుదలచేసింది. అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించింది. తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.
ఎన్‌డీఏ, ఎన్‌ఏ-2024 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I)- 2024 నోటిఫికేషన్ గతేడాది డిసెంబరు 20న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించారు. శిక్షణతోపాటు త్రివిధ దళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి, జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, జనవరి 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 153వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 115వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు.
సందేహాలుంటే సంప్రదించవచ్చు..
➥అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే 011-23385271/011- 23381125/011-23098543 ఫోన్ నెంబర్లలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు.
➥ అలాగే ఇంటర్వ్యూకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు.
➥ అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై 011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.
ఎంపికైనవారికి శిక్షణ ఇలా..
తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.