TS DSC 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 28న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
TS DSC 2023: తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఫిబ్రవరి 28న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు ప్రకారం.. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెప్పినప్పటికీ.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, త్వరలోనే మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు.
ఒకట్రెండు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో (ఫిబ్రవరి 29 లేదా మార్చి 1న) 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి మూడునెలల్లో పరీక్ష నిర్వహించి, జూన్ నాటికి నియామకాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను అప్పట్లో ఆదేశించారు.