TS DSC: ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు? అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్!
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలతోపాటు డీఎస్సీ ఎస్‌జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వాయిదా పడితే మళ్లీ ఫిబ్రవరిలోనే జరుపుతారని తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో.. పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షలు వాయిదాపడే పరిస్థితి నెలకొంది. వీటిలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలతోపాటు డీఎస్సీ ఎస్‌జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాలి. నవంబరు 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కనీసం ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదని నిపుణులు భావిస్తున్నారు.
ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని, అందువల్ల టీఆర్‌టీ నిర్వహణపై దృష్టి పెట్టడం సాధ్యంకాదని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబరు 20 నుంచి 24 వరకు జరిగే స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టుల పరీక్షలకు ఇబ్బందిలేదని చెబుతున్నారు. అయితే నవంబరు 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరిలో పరీక్షలు..?
టీఆర్‌టీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలకు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్షలను నవంబరులో నిర్వహించకుంటే.. మళ్లీ ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీసీఎస్ అయాన్ అప్పట్లోనే స్పష్టంచేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడితే మళ్లీ ఫిబ్రవరిలోనే జరుపుతారని తెలుస్తోంది.
ALSO READ:
ఒక్క నోటిఫికేషన్ పూర్తిచేయలేదు, ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో ఆవేదన
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్, ఎప్పటివరకంటే!
తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..