బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!
కొత్త ఆప్ తో స్ట్రోక్ లక్షణాలను స్మార్ట్ ఫోన్లు గుర్తించగలవు. FAST.AI అనే ఆప్ న్యూరాలజిస్ట్ మాదిరిగానే పరిస్థితిని కచ్చితంగా గుర్తిస్తుందని అమెరికన్ పరిశోధకులు అంటున్నారు.
మెదడు చురుగ్గా ఉంటేనే మనం చురుగ్గా ఉంటాం. మెదడు చురుగ్గా ఉండాలంటే.. శరీరంలోని రక్తనాళాల వ్యవస్థ కూడా సక్రమంగా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. బ్రెయిన్‌కు రక్తం అందక స్ట్రోక్ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, దీన్ని ముందుగానే గుర్తించే యాప్‌లో ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. వాటి సాయంతో ఇంట్లో ఉండే మీ మొబైల్ సాయంతో స్ట్రోక్‌ను ముందుగానే గుర్తించి డాక్టర్‌ను సంప్రదింవచ్చు.
‘స్ట్రోక్’ విషయంలో టైం చాలా ముఖ్యం. స్ట్రోక్ వచ్చిన మొదటి గంటలోపే చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయాన్ని గోల్డెన్ హవర్ అంటారు. ఇలా స్ట్రోక్ వచ్చిందని గుర్తించే యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. FAST.AI అనే యాప్ న్యూరాలజిస్ట్ మాదిరిగానే పరిస్థితిని కచ్చితంగా గుర్తిస్తుందని అమెరికన్ పరిశోధకులు అంటున్నారు. ఈ యాప్ ఫోన్ కెమెరాను ఉపయోగించి ముఖం, చేతుల్లో లేదా శరీరంలో ఒకవైపు వచ్చిన మార్పులను సరిగ్గా అంచనా వెయ్యగలుగుతుంది ఈ యాప్. వెంటనే లక్షణాలను గుర్తించడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించేందుకు అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా స్ట్రోక్ ను గుర్తించడంలో సమయం అత్యంత కీలకం. సమయానికి చికిత్స ప్రారంభించగలిగితే శాశ్వత నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు.
లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ రాడోస్లావ్ రేచెవ్ మాట్లాడుతూ ‘‘ఈ ఆప్ చాలా ఉపయోగకరమని ఇప్పటి వరకు అందిన డేటాను బట్టి చెప్పవచ్చు. చాలా మంది క్లాట్ - బస్టీంగ్ చికిత్సకు సకాలంలో హాస్పిటల్ కు చేరుకోలేక ప్రమాదకర స్థితికి చేరుకుంటారు. అదే త్వరగా స్ట్రోక్ లక్షణాలను గుర్తించి వెంటనే అంబులెన్స్ కు కాల్ చెయ్యగలిగితే పరిస్థితులు విషమించక ముందే చికిత్స ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది.’’ అన్నారు. స్ట్రోక్ చికిత్సలో సరైన సమయంలో లక్షణాలు గుర్తించి చికిత్స ప్రారంభించడమే కీలకం. ఈ యాప్ ఆ పనిని చాలా సమర్థవంతంగా చెయ్యగలదని నిపుణులు కూడా నిర్ధారిస్తున్నారు.
రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి మెదడుకు అవసరమైనంత మేర రక్తం, ఆక్సిజన్ చేరక పోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇలా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడానికి పొగతాగే అలవాటు, బరువు ఎక్కువగా ఉండడం, బీపీ, కొలేస్ట్రాల్, షుగర్, పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకునే అలవాటున్న వారిలో ఎక్కువ. లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా మొదలవుతాయి.
అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ దాదాపు 270 మంది స్ట్రోక్ బారిన పడిన వారిని పరీక్షించి 2023లో పలు వివరాలు సమర్పించారు. దీని కోసం నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ సెంటర్ల హాస్పిటల్స్ లో చేరిన రోగులను ఎంచుకున్నారు. ఈ యాప్‌ను వారిపై పరీక్షించిన తర్వాత దాదాపు రోగులందరిలో స్ట్రోక్ ఏర్పడినప్పుడు ముఖంలో కలిగే మార్పులను కచ్చితంగా గుర్తించింది. చేతిలో వచ్చిన బలహీనతలను కూడా చాలా వరకు గుర్తించినట్టు నిర్ధారించారు. స్లర్డ్ స్పీచ్ మాడ్యూల్ ను పరీక్షించినపుడు కూడా స్పీచ్ లో మార్పులను కూడా చాలా వరకు గుర్తించినట్టు తేలింది. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వ్యక్తులను కాపాడే చిన్నఅవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ కు చెందిన ప్రొఫెసర్ డేనియల్ లాక్ ల్యాండ్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. ఈ యాప్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు.
స్ట్రోక్ లక్షణాలు ఇవే:
⦿ స్ట్రోక్ లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. ఒకొక్కరిలో ఒక్కోరకంగా ఉంటాయి. కానీ అందరిలో అకస్మాత్తుగానే మొదలవుతాయి.
⦿ ముఖం ఒక వైపు పడిపోవచ్చు (ముఖ పక్షవాతం). చిరు నవ్వులో మార్పులు కనిపిస్తాయి, ఒక కన్ను రెప్ప పడకపోవచ్చు.
⦿ చెయ్యి బలహీనంగా ఉంటుంది. తిమ్మిరి వల్ల రెండు చేతులు ఎత్తలేకపోవచ్చు. కోరుకున్నట్టు కదల్చలేక పోవచ్చు.
⦿ మాటలో స్పష్టత లోపించవచ్చు. అసలు మాట్లాడలేకపోవచ్చు. ఎదుటి వారు చెప్పేది అర్థం చేసుకోవడంలో కూడా సమస్యలు ఉండొచ్చు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.