Jammu Shootout: రిపబ్లిక్ డే ముందు ఉగ్రవాదుల దుశ్చర్య.. జమ్ములో ఆర్మీ క్యాంప్‌పై దాడితో ఢిల్లీలో అలర్ట్
దేశంలో గణతంత్ర వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. జమ్మూలోని ఆర్మీ క్యాంపుపై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దేశంలో గణతంత్ర వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. జమ్మూలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతను కట్టుదిట్టం చేస్తున్న క్రమంలోనే దాడులుకు పాల్పడ్డారు. కతువా జిల్లా బిల్లావర్‌లోని భటోడి గ్రామంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర చర్యలతో అప్రమత్తమైన జవాన్లు ఎదరుకాల్పులు చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఎదురుకాల్పుల్లో ఎంతమంది చనిపోయారనే విషయం మాత్రం తెలియలేదు.
వేడుకలను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
జనవరి 26న గణతంత్ర వేడుకలను జమ్ము రాజధాని శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే గ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రదాడులకు పాల్పడవచ్చని భద్రతా ఏజెన్సీలకు ఇన్‌పుట్‌లు అందాయి. ఈ నేపథ్యంలోనే గణతంత్ర వేడుకలను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేసేందుకు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు శ్రీనగర్‌లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాన లాల్ చౌక్ ప్రాంతంలోనూ భారీ స్థాయిలో భద్రతను మోహరించారు.
ఉగ్ర బెదిరింపులపై నిఘా పెట్టాం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికైన బక్షి స్టేడియం వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేందుకు విస్తృతమైన నిఘాతో పాటు బహుళస్థాయి భద్రతా వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. లొంగిపోయిన మాజీ మిలిటెంట్లతో సహా ఉగ్ర బెదిరింపులపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని అనుసరిస్తున్నామన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

