ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు శెనగపప్పును దూరం పెట్టాల్సిందే
శెనగపప్పుతో చేసే వంటలు రుచికరంగా ఉంటాయి. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఆ పప్పుని తినకపోవడమే మంచిది.
తెలుగింటి వంటల్లో శెనగపప్పుకి మంచి ప్రాధాన్యత ఉంది. పండగలు వస్తే పూర్ణం బూరెలు వండాలంటే శెనగపప్పు కచ్చితంగా ఉండాల్సిందే. అంతే కాదు ఈ పప్పులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, కాల్షియం, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినమనే చెబుతారు పోషకాహార నిపుణులు. ఇవి శరీరానికి మంచి పోషణను అందిస్తాయి. అలాగే శనగపప్పు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పప్పు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. కానీ కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రం శెనగపప్పును దూరం పెట్టాలి. ఆ పరిస్థితుల్లో శెనగపప్పును అధికంగా తింటే హానికరంగా మారవచ్చు.
పొట్ట నొప్పి
పొట్ట నొప్పి వేధిస్తున్నప్పుడు శెనగపప్పుతో చేసిన వంటకాలను దూరం పెట్టాలి. ఈ పప్పులో ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ, పొట్టనొప్పి వేధిస్తున్నప్పుడు దీన్ని తినకపోవడమే మంచిది. లేకుంటే నొప్పి ఇంకా పెరుగుతుంది.
గర్భిణులు
గర్భంతో ఉన్నప్పుడు మహిళలు శెనగపప్పుతో చేసిన వంటకాలు తక్కువగా తినాలి. అధికంగా తింటే పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా వీటిని ఎక్కువగా తినకూడదు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం.
ఎసిడిటీ
కొందరిని గ్యాస్, ఎసిడిటీ సమస్యలు అధికంగా బాధిస్తాయి. అలాంటివారు శెనగపప్పును దూరం పెట్టడం చాలా మంచిది. లేకుంటే శెనగపప్పుతో చేసిన వంటకాలు తిన్న తర్వాత పొట్టలో గ్యాస్, ఎసిడిటీ అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పప్పు తినడం మానేయాలి. పప్పు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. తినడం వల్ల గుండెల్లో మంట, పుల్లని తేనుపులు వచ్చే అవకాశం ఉంది.
పిల్లలకు, వృద్ధులకు
చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు కూడా శెనగపప్పుతో చేసిన వంటకాలు తక్కువగా పెట్టాలి. ఎందుకంటే వీరిద్దరి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ పప్పు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అంత శక్తి వారి జీర్ణ వ్యవస్థకు ఉండదు. కాబట్టి పప్పు సరిగా అరగక, పొట్టనొప్పి వస్తుంది. కాబట్టి వాళ్లకి కూడా శనగపప్పు వంటలు పెట్టకూడదు.
శెనగపప్పు తిన్న వెంటనే ఏదైనా తేడాగా అనిపించినా, అలెర్జీలా వచ్చినా తినడం మానేయాలి. వైద్యున్ని సంప్రదించాలి.
Also read: నాటు నాటు పాట వల్ల 6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన చెర్రీ - డ్యాన్స్ వల్ల ఎవరైనా ఇట్టే బరువు తగ్గేస్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.