Improve your Memory: వీటికి దూరంగా ఉండండి.. మెమొరీ పెంచుకోండి
విషయాలు త్వరగా మర్చిపోతున్నారా? చదివింది కూడా గుర్తు ఉండడం లేదా? మీ మతిమరుపుకు ఈ ఆహార పదార్థాలేమో కారణం కావచ్చు. వీటికి ఎంత దూరంగా ఉంటే మీ జ్ఞాపకశక్తి అంతగా పెరుగుతుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం సహజం. కానీ ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మతిమరుపు దరి చేరకుండా, బ్రెయిన్ పవర్ పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం అత్యవసరం. కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు, శారీరక ఆరోగ్యానికి ఈ ఆహారపదార్థాలకు నో చెప్పాల్సిన అవసరం ఉంది. అవేంటో వాటికి ఎందుకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం రండి.
సాఫ్ట్ డ్రింకులు
రకరకాల సాఫ్ట్ డ్రింకులు మార్కెట్లో విచ్చలవిడిగా విడుదలవుతున్నాయి. పెద్దవాళ్లు తాము తాగడమే కాదు, పిల్లల చేత కూడా గడగడా తాగించేస్తున్నారు. అలా చేస్తే మీ పిల్లల మెమోరీ పవర్ ను చేతులారా మీరే తగ్గించిన వారవుతారు. వీటిలో ‘ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్’ ఉంటుంది. ఇది ప్రమాదకరమైనది. మెదడుపై ఈ సిరప్ ప్రభావం చూపిస్తుంది. వాపు రావడం లేదా, మెదడులో మెమోరీ, లెర్నింగ్ ఈ రెండు చర్యలు అనుసంధానం కాకుండా చేయడం వంటివి జరుగుతుంది.
చిప్స్, వేఫర్స్
పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఇష్టంగా తినేవి ఇవే. ఇంట్లో టీవీ చూస్తున్నా, థియేటర్లో సినిమా చూస్తున్నా చేతిలో చిప్స్ ప్యాకెట్లు ఉండాల్సిందే. వీటిలో అధికంగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. బ్రెయిన్ పవర్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది.
Also Read: గడ్డం ఉంటే అదో కిక్కు.. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ని అమ్మాయిలే గడ్డం పెంచేయమంటున్నారు
నూడుల్స్
ఇప్పుడు ఎంతో మంది ఫేవరేట్ వంటకం నూడుల్స్. ఆన్ లైన్ ఆర్డర్లలో బిర్యానీ తరువాత స్థానం చైనీస్ నూడుల్స్ దే. కానీ ఈ జంక్ ఫుడ్ మెదడు కణాల ఉత్పత్తి, వాటి పెరుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల మెమొరీ పవర్ గణనీయంగా తగ్గుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడుపైనే కాదు, దాదాపు అన్ని ప్రధాన అవయవాలపైన ప్రభావం పడుతుంది. అప్పుడప్పుడు తాగే వాళ్లతో పోలిస్తే రోజూ ఆల్కహాల్ తీసుకునేవాళ్లకి మెమోరీ పవర్ విపరీతంగా తగ్గే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ బి1 ను పీల్చేసుకుని, న్యూరో ట్రాన్స్ మీటర్లు నాశనం అవ్వడానికి కారణం అవుతుంది. తద్వారా జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
Also Read: ముఖానికి ఐస్ క్యూబ్స్ తో మర్ధనా చేస్తున్నారా? అయితే ఇది చదవండి
ఏం తినాలి?
మెమొరీ పవర్ పెంచుకోవడానికి ఒమెగా 3 అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తినాలి. అవిసె గింజలు, వాల్ నట్స్ వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. గుమ్మడి గింజలు, బ్రాకోలీ, పసుపు, బ్లూ బెర్రీస్, చేపలు, డార్క్ చాకొలెట్, నారింజలు, గుడ్లు, గ్రీన్ టీ వంటివి రోజూ తీసుకోవాలి.