Brain Damage: ఫాస్ట్ ఫుడ్‌ను లొట్టలేసుకుని తింటున్నారా? మీకే కాదు.. మీ ముందు తరాలకూ ముప్పే, ఏం జరుగుతుందంటే?
ఫాస్ట్ ఫుడ్ వల్ల దీర్ఘకాలికంగా మెదడు దెబ్బతినవచ్చని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు రాబోయే తరాల మెదడు మీద కూడా దీని ప్రభావం ఉండేంత ప్రమాదకరమట ఈ కాలుష్యం.
వేపుళ్లు ఆరోగ్యానికి మంచిది కాదనేది జగమెరిగిన విషయమే. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర ఫాస్ట్ ఫూడ్ వల్ల దీర్ఘకాలికంగా మెదడు దెబ్బ తినవచ్చని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు రాబోయే తరాల మెదడు మీద కూడా దీని ప్రభావం ఉండేంత ప్రమాదకరమట ఈ కాలుష్యం.
ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడి చేసిన నూనెలో వేయించిన ఆహారం.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం కోసం చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా రెస్టారెంట్లలో ఇలా ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడిచేసిన నూనెను ఉపయోగిస్తారు. ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ వేడిచేసిన నూనెలో మెదడుకు నష్టం చేసే లక్షణాలు ఉన్నాయట. ఈ నూనెతో చేసిన ఆహారం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బ తింటోందని వాళ్లు కనుక్కున్నారు.
అధ్యయనంలో భాగంగా కొన్ని ఎలుకలకు అలా వండిన ఆహారాన్ని తినిపించారు. ఆ తర్వాత వాటి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ఎలుకల కాలేయంలో వాపును గమనించారు. అంతేకాదు.. వాటిలో జ్ఞాపకశక్తి తగ్గడాన్ని కూడా గుర్తించారు. ఇది దీర్ఘకాలంలో డిమెన్షియాకు కారణం కాగలదని తెలుసుకున్నారు. ఎక్కువ వేడి చేసిన నూనెలో వండిన ఆహారాల వల్ల మెదడు దెబ్బతినవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు.
ఇలాంటి ఆహారం తిన్న ఎలుకల పిల్లలకు కూడా అదే సమస్య కనిపించింది. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఎక్కువ ఉష్ణోగ్రత స్థాయిల్లో వేడి చేసిన నూనెలో తయారు చేసిన ఆహారం చాలా రకాల జీవక్రియలకు సంబంధించి రుగ్మతలకు కారణం కాగలదని హెచ్చరిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడి చేసిన నూనె.. న్యూరోడీజెనరేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఫాస్ట్ ఫుడ్ అతిగా తినొద్దు
ఫాస్ట్ పుడ్ సెంటర్లలో నూనెను కొన్ని రోజులు, వారాల పాటు వినియోగిస్తారు. తాజా నూనెతో చేసిన ఆహారం తిన్నప్పుడు, మళ్లీ మళ్లీ వేడిచేసిన నూనెతో చేసిన ఆహారం తిన్నపుడు ఆరోగ్యంలో చాలా వ్యవత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ మళ్లీ మళ్లీ వేడి చేసినపుడు కాలేయంలో ఆక్సిడేషన్ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ పెరిగింది. పెద్ద పేగులో కూడా గణనీయమైన నష్టాన్ని గమనించారట. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందట.
నాణ్యత లేని ఆహారం ప్రభావం మెదడు ఆరోగ్యం మీద ఉంటుందని తెలియజేసే పరిశోధన ఇదే మొదటిది కాదు. ఇప్పటికే ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్రిస్ప్ గా వేయించిన మాంసాహారాలు ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో పేర్కొన్నారు. వృద్దులు ఆకస్మికంగా జ్ఞాపకశక్తి కోల్పోవడానికి నేరుగా సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు.
Also Read : Sleeping Problems In Women: పురుషుల కంటే స్త్రీలకే నిద్ర సమస్యలు ఎక్కువట - మీరు నమ్ముతారా? ఇవిగో ఆధారాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.