Sleeping Problems In Women: పురుషుల కంటే స్త్రీలకే నిద్ర సమస్యలు ఎక్కువట - మీరు నమ్ముతారా? ఇవిగో ఆధారాలు
పురుషుల కంటే స్త్రీలు 60 శాతం ఎక్కువ నిద్ర సమస్యలను అనుభవిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చూడండి.
ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడమంటే చాలా కష్టం. కొందరు మొబైల్ ఫోన్స్, టీవీలు చూస్తూ కావాలనే నిద్రను దూరం చేసుకుంటుంటే.. మరికొందరు బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. అయితే, నిద్ర సమస్య అనేది అందరికీ ఒకేలా ఉంటుందని అనుకుంటే పొరపాటే. జెండర్‌ను బట్టి నిద్ర సమస్య మారుతుందట. ఔనండి.. మీరు నమ్ముతారో లేదో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలలోనే నిద్ర సమస్యలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా..
హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, సౌత్ ఆప్టన్ యూనివర్సిటికి చెందిన కొందరు మహిళా పరిశోధకుల బృందం స్త్రీల నిద్ర నాణ్యత గురించి అధ్యయనం నిర్వహించారు. ఇందులో స్త్రీల నిద్ర నాణ్యత అంతగా బాగా లేదని నిర్థారణ జరిగింది. స్త్రీ శరీర గడియారం 6 నిమిషాలు వేగంగా నడుస్తుందట. అందువల్ల వీరిలో నిద్ర సమస్యలు ఎక్కువ అని వీరు చెబుతున్నారు.
ఈ తేడా చిన్నదేమీ కాదు
బాడీ క్లాక్ 6 నిమిషాలు వేగంగా నడవడం వల్ల వీరికి పరిసరాలతో సమన్వయ లోపం ఏర్పడి ఇలా నిద్ర సమస్యలు వస్తాయని అంటున్నారు. చెప్పడానికి ఆరు నిమిషాలే కదా అనిపించవచ్చు. కానీ ఆ తేడా నిద్ర పట్టేందుకు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రెన్స్కే లోక్ చెప్పారు. సెంట్రల్ బాడీ క్లాక్‌కు స్లీప్ సైకిల్‌కు మధ్య సమన్వయం లోపించడం వల్ల మహిళల స్లీప్ సైకిల్ పురుషుల కంటే ఐదు రెట్లు ఎక్కువ.
ఒక గడియారం నిరంతరం 6 నిమిషాలు ఫాస్ట్ గా లేదా నెమ్మదిగా నడిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. కొన్ని రోజుల్లో భయంకరమైన సమన్వయ లోపంగా మారుతుంది. మహిళల బాడీ క్లాక్ విషయంలో కూడా ఇదే జరుగుతోందనేది నిపుణుల అభిప్రాయం. దీనికి సంబంధించినా రివ్యూస్ స్లీప్ మెడిసిన్ లో ప్రచురించారు. నిద్రకు సంబంధించిన విషయాల్లో లింగ బేధం ప్రాధాన్యత ఉంటుందని ఈ పేపర్ చెబుతోంది. స్లీప్ గ్యాప్, లింగబేధం మధ్య ఉన్న సంబంధం గురించి బహుళ విద్యాలయ నిపుణుల బృందం ఇలా ప్రచురించిన అనేక అకాడమిక్ పేపర్లను పరిశీలించారు.
ఈ అధ్యయనం కోసం స్త్రీ పురుషులిద్దరి నిద్ర ప్యాటర్న్ లను పరీశీలించారు. వీరిలో స్త్రీలు నిద్ర నాణ్యత తక్కువ రేటింగ్ ఇచ్చారు. నిద్ర నాణ్యత వారి నెలసరి సైకిల్ మీద కూడా ప్రభావం చూపుతోందట. దాదాపుగా 53 శాతం మంది మహిళలు నెలసరి సమయంలో రాత్రి సమయంలో ఆందోళనకు గురవుతారు. అసౌకర్యంగా ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నిద్రకు అంతరాయం కూడా కలుగుతుందట.
హార్మోన్లు కూడా కొంత కారణమే
నిద్రకు భంగం కలిగించే రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ సమస్య కూడా స్త్రీలలో పురుషుల కంటే 25-50 శాతం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కేవలం నిద్ర లేమి వల్ల స్త్రీలలో స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో రాత్రి సమయాల్లో ఎక్కువ సార్లు తింటుంటారు. పురుషుల్లో స్లీప్ ఆప్నియా సమస్య స్త్రీల కంటే ఎక్కువ. సర్కాడియన్ రిథమ్ లో తేడా కేవలం నిద్రను మాత్రమే ప్రభావితం చేస్తాయని అనుకుంటే అది పొరపాటే. ఇది రకరకాల అనారోగ్యాలకు కారణం కాగలదు. మూడ్ డిజార్డర్ల నుంచి మెదడు పని తీరు వరకు రకరకాల అంశాలను నిత్య జీవితంలో ప్రభావితం చేస్తుంది.
బాడీ క్లాక్ లో ఉన్న ఆరునిమిషాల తేడాతో పాటు నెలసరి, మెనోపాజ్ వంటి హార్మోనల్ రిలేటెడ్ విషయాలు కూడా స్త్రీల నిద్ర మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఈ నిపుణుల బృందం నిర్ధారిస్తున్నారు.
Also read : Chickenpox: వేసవిలో చికెన్‌పాక్స్ ముప్పు - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.