Chickenpox: వేసవిలో చికెన్‌పాక్స్ ముప్పు - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వేసవిలో సోకే ఇన్ఫెక్షన్లలో చికెన్‌పాచిక్స్ ఒకటి. దీన్నే అమ్మవారు లేదా ఆటలమ్మ సోకిందని అంటుంటారు. సొంత వైద్యం గురించి ఆలోచించకుండా తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి క్రమంగా తీవ్రమవుతోంది. పిల్లలు, వృద్ధులు, గర్భవతులు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటించి తీరాలి. వీరిలో ఇమ్యూనిటి తక్కువగా ఉంటుంది కనుక కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం వీరికి ఎక్కువ. వేసవి వేధించే ఇన్ఫెక్షన్లలో చికెన్‌పాక్స్(chickenpox) ఒకటి. దీనినే మన వాళ్లు అమ్మవారు పోసిందని, ఆటలమ్మ సోకిందని అంటుంటారు. అయితే, సొంత వైద్యాన్ని నమ్ముకోకుండా వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చికెన్‌పాక్స్ అంటే?
చికెన్‌పాక్స్ వ్యారిసెల్ల జోస్టర్ అనే వైరస్ వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్. ఇది వరకు ఈ వ్యాధి సోకని వారు, ఇమ్యూనిటి తక్కువగా ఉన్న వారు, వ్యాక్సిన్ తీసుకోని వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఒక సారి ఈ వ్యాధి బారిన పడినవారి శరీరంలో దీనికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి కనుక మరోసారి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉండదు.
అంటువ్యాధా?
చికెన్‌పాక్స్ సోకిన వారితో సన్నిహితంగా ఉండేవారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చికెన్‌పాక్స్ సోకిన వారిలో ఏర్పడే పొక్కుల నుంచి.. కారే రసి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. లక్షణాలు 10, 12 రోజుల పాటు ఉంటాయి.
లక్షణాలు
జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, తలనొప్పి, శరీరం మీద రాష్ లేదా పొక్కులు కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖ్యంగా ముఖం, ఛాతి, పొట్ట, వీపు, కాళ్లు, చేతుల మీద రాషెస్‌లా మొదలై క్రమంగా వాటిలో నీరు నిండి.. పొక్కులుగా మారుతాయి. ఇవి 4-7 రోజుల్లోగా ఎండిపోతాయి.
ప్రమాదకరమా?
జ్వరం నాలుగు రోజులకు మించి కొనసాగినపుడు, పొక్కుల్లో చీము కనిపించినపుడు, నొప్పిగా ఉన్నపుడు, ఎక్కువ నిద్రపోతున్నపుడు, నడవడంలో ఇబ్బందిగా ఉండడం, మానసిక సమతుల్యత లోపించడం, మెడనొప్పి తీవ్రంగా ఉండడం, వాంతులు, శ్వాస వేగం పెరగడం, దగ్గు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చికెన్‌పాక్స్ తో పాటు న్యూమోనియా, ఎన్సెఫలైటిస్, లివర్ లో ఇన్ఫ్లమేషన్, సెప్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంట్లో ఇన్ఫెక్షన్ సోకిన వారు ఉన్నపుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రోగి పడుకునే గదిలో వెంటిలేషన్ ధారాళంగా ఉండేట్టు చూసుకోవాలి. తాగేందుకు ఎక్కువ నీళ్లు ఇవ్వాలి. పండ్లు ఎక్కువగా తినాలి. వీలైనంత వరకు ఇతరులతో కలవకుండా ఉండాలి. రోగి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదు. వాటిని బ్లీచింగ్ సొల్యూషన్ తో శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి.
పొక్కులు ఏర్పడిన చోట దురదగా ఉంటుంది. అక్కడ కాలమైన్ సొల్యూషన్ రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొద్ది పాటి విరామంతో తరచుగా తడివస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. చేతి గోళ్లు శుభ్రంగా కత్తిరించాలి. దురదగా ఉండడం వల్ల అసంకల్సితంగా గోళ్లతో గీరితే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇంట్లో ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు ఉన్నట్లయితే.. వైద్యుల సలహా తీసుకుని 72 గంటల్లోపు వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాపించకుండా నిరోధించవచ్చు.
Also Read : ఇలా చేస్తే? మీ వయస్సు 8 ఏళ్లు వెనక్కి, లేదంటే త్వరగా ముసలోళ్లు అయిపోతారు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.