Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం నాడు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. నలుగురు కివీస్ ఆటగాళ్లను సమర్థంగా ఎదుర్కొంటే భారత్ విజయం సాధిస్తుంది.

భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ ఆదివారం (జనవరి 18న) ఇండోర్‌లో జరగనుంది. రెండు వన్డేల తర్వాత సిరీస్ 1- 1తో సమంగా ఉంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టు వన్డే రికార్డు అద్భుతంగా ఉండటం ఆతిథ్య జట్టుకు కలిసిరానుంది. ఇక్కడ ఇప్పటివరకు ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేదు. కానీ కొందరు న్యూజిలాండ్ ఆటగాళ్లు మూడో ODI మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కివీస్ జట్టులోని ఏ నలుగురు ఆటగాళ్లతో భారత జట్టు జాగ్రత్తగా ఉండాలి, వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటే టీమిండియా విజయం సాధ్యమవుతుంది.
డారిల్ మిచెల్
భారత్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో డారిల్ మిచెల్ 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా మిచెల్ సెంచరీ సాధించాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో డారిల్ మిచెల్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకుండా ఆపడం ఇండియా బౌలర్లకు అతిపెద్ద సవాలుగా మారవచ్చు. భారత బౌలర్లు అతన్ని ఎలాగైనా త్వరగా అవుట్ చేస్తేనే జట్టుకు కలిసిరానుంది. లేకపోతే రెండో వన్డేలో ఎదురైన ఫలితం లాంటివి రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
మైఖేల్ బ్రేస్‌వెల్
మైఖేల్ బ్రేస్‌వెల్ ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2 మ్యాచ్‌లలో అతను ఇప్పటివరకు 2 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ అతని స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. రెండో వన్డే మ్యాచ్‌లో అతను 10 ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇవ్వడం భారత్ పరుగులు చేయకుండా కట్టడి చేసింది.
కైల్ జేమీసన్
6 అడుగుల 8 అంగుళాల పొడవున్న బౌలర్ కైల్ జేమీసన్ సహజంగానే బౌలింగ్‌లో ఎక్కువ బౌన్స్ సాధిస్తాడు. అతని స్లో బంతులు ముఖ్యంగా మొదటి ODIలో భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టాయని తెలిసిందే. జేమీసన్ ఇప్పటివరకు ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. జేమీసన్ 2 వన్డే మ్యాచ్‌లలో 5 వికెట్లు తీశాడు.
విల్ యంగ్
భారత్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో విల్ యంగ్ ఫ్లాప్ అయ్యాడు, కానీ రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పుడు ఒత్తిడితో కూడిన సమయంలో విల్ యంగ్ కీలకమైన 87 పరుగులు చేశాడు. యంగ్ ఎక్కువసేపు క్రీజులో ఉండటం ఇండియాకు సమస్యగా మారవచ్చు. కనుక అతడ్ని సైతం త్వరగా ఔట్ చేస్తేనే భారత్‌కు ప్రయోజనం ఉంటుంది.





















