Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్
నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. కానీ నిలబడి నీళ్ళు తాగితే మాత్రం ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఆరోగ్యం దగ్గర నుంచి అందం ఇచ్చే విషయంలో నీరు అధిక పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీటిని తాగాలని అంటారు. మరి అంత ముఖ్యమైన నీటిని ఎలా తాగుతున్నారు? అదేం ప్రశ్న ఎలా తాగుతారు అని అనుకుంటున్నారా? అవును నీళ్ళు తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే నీరు తాగేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. ఎలా పడితే అలా నీళ్ళు తాగితే అది శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది.
కూర్చుని తాగాలి
చాలా మంది నిలబడి నీళ్ళు తాగేస్తారు. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిలబడి నీళ్ళు తాగకూడదు. అలా చేస్తే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని పెద్దలు అంటారు. ఆయుర్వేదం ప్రకారం నిలబడి ఏదైనా తాగడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కీళ్లలో అదనపు ద్రవాలు పేరుకుపోవడానికి, ఆర్థరైటిస్ సమస్య ఏర్పడేందుకు దారి తీస్తుంది. అందుకే ఖచ్చితంగా కూర్చుని నీళ్ళు తాగడం మరచిపోవద్దు.
ఒకేసారి మొత్తం తాగొద్దు
కొంతమంది గ్లాస్ ఎత్తారంటే గుట గుట మొత్తం నీళ్ళు ఒకేసారి తాగేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఒకసారి సిప్ చేసిన తర్వాత కొన్ని సెకన్ల విరామం తీసుకోవాలి. నీళ్ళు తొందరగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. అదే కొద్ది కొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియకి సహాయపడుతుంది.
చల్లటి నీరు అసలే వద్దు
వేసవి కాలంలో చల్లగా ఉన్న నీళ్ళు తాగడం వల్ల కాసేయ ఉపశమనంగా అనిపిస్తుంది కానీ ఫ్రిజ్ నుంచి నేరుగా నీటిని ఎప్పుడు తాగకూడదు. వాటిని గది ఉష్ణోగ్రత ఉన్న నీటితో కలుపుకుని తాగొచ్చు. శీతాకాలంలో ఎప్పుడు మామూలు నీళ్ళు లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. చల్లటి నీళ్ళు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. వెచ్చని నీరు జీర్ణక్రియకి మరింత సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది.
ఉదయం లేవగానే నీళ్ళు తాగాలి
నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఉదయం పూట నీరు తాగదాన్ని ఉషపన్ అంటారు. శరీరం నుంచి విషాన్ని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగులని క్లియర్ చేస్తుంది. శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది.
ఇలా అనిపిస్తే నీళ్ళు తాగాలి
శరీరం డీహైడ్రేషన్ కి గురైనప్పుడు నీళ్ళు తాగమని కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. పెదవులు పగిలిపోవడం, నోరు పొడిబారిపోవడం, మూత్ర విసర్జన తగ్గడం లేదా మూత్రం ముదురు రంగు వంటి సంకేతాలు కనిపిస్తే నీటి వినియోగాన్ని పెంచాలని అర్థం.
నీటి నిల్వ ముఖ్యమే
రాగి లేదా వెండి పాత్రల్లో నీటిని నిల్వ చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. రాగి లేదా వెండి గ్లాసులో తాగినా కూడా మంచిది. వీటిలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఈ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ సులభం అవుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.