Maharastra Assembly : మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వీరవిహారం.. 5 రోజుల్లో 50 మందికి పాజిటివ్ !
ఐదు రోజుల పాటు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 50మందికి కరోనా సోకింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ముగిశాయి. ఈ మధ్యలో అసెంబ్లీలో ఎంత చర్చించారో కానీ కరోనా వైరస్ మాత్రం అదర గొట్టేసింది. యాభై మందిని అంటుకుంది. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులు కరోనా బారిన పడ్డారు. శీతాకాల సమావేశాలు జరిగిన 5 రోజుల్లో దాదాపు 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Also Read: దేశంలో ఒమిక్రాన్ దడ.. 800కు చేరువలో మొత్తం కేసులు
మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్, మరో మంత్రి కెసి పాడ్వి, బిజెపి ఎమ్మెల్యే సమీర్ మేఘేలకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు వైరస్ సోకిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వర్ష గైక్వాడ్ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో మరింత మందికి వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం ఒక్క రోజే 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తూండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకలపై కూడా నిషేధం విధించింది. అయినా కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌లోనూ దూకుడుగా ఉంది. డబుల్ డోస్ వ్యక్సిన్లను అత్యధికంగా పంపిణీ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం