‘ప్రిన్స్’పై భారీ అంచనాలు, అనుదీప్‌కు అగ్నిపరీక్షే!
‘జాతి రత్నాలు’తో హిట్ కొట్టి.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’తో ఫ్లాప్ అందుకున్న అనుదీప్ ‘ప్రిన్స్’తో హిట్ కొట్టగలడా?
అనుదీప్ కెవి ఈ పేరుకు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జాతిరత్నాలు’ సినిమాతో డైరెక్టర్ అనుదీప్ కెవి కెరీర్ లో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ఓ వెరైటీ కాన్సెప్ట్ తో కామెడీనే ప్రధాన అస్త్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. సైలెంట్ గా వచ్చిన జాతిరత్నాలు సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడంలో జాతిరత్నాలు మంచి ఉత్సాహాన్ని తెచ్చింది. అయితే ఈ సినిమా అనుదీప్ కంటే ఎక్కువ నవీన్ పొలిశెట్టికి ప్లస్ అయిందనే వార్తలు కూడ వచ్చాయి. ఈ సినిమా తర్వాత అనుదీప్ నుంచి పెద్దగా సినిమా అనౌన్స్మెంట్ లు ఏమీ జరగలేదు. కానీ నవీన్ పొలిశెట్టికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఇటీవల కాలంలో అనుదీప్ డైరెక్షన్ తప్ప అన్నీ తానై ఓ సినిమాను రూపొందించారు. అదే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా.
ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే బాక్స్ ఆఫీసు వద్ద బోల్తాపడింది. దీంతో అనుదీప్ ఓ మెట్టు కిందకు పడినట్టైంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ప్రిన్స్'. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న(మంగళవారం) జరిగింది. ఉక్రెయిన్ నటి మరియా కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు విజయ్ దేవరకొండతోపాటు దర్శకుడు హరీష్ శంకర్ అతిథులుగా హాజరయ్యారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా అట్టహాసంగా ఉత్సాహంగా సాగింది. అయితే ఈ సినిమా మొదట ద్విభాష చిత్రంగా ప్రచారం చేసినా పక్కా తమిళ్ సినిమాలా కనిపిస్తోంది. మొత్తం తమిళ నటులు ఉండటంతో తమిళ్ వెర్షన్ నే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని తీసినట్టు కనిపిస్తోంది. ఇక శివకార్తికేయన్ సినిమాలు గతంలో తెలుగు విడుదల అయ్యాయి. ఆ సినిమాలన్నీ ఇక్కడ కాస్త మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రెమో, డాక్టర్ లాంటి సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి కూడా.
అయితే ఇప్పుడు డైరెక్టర్ అనుదీప్ కి అసలు పరీక్ష ఎదురవ్వబోతోంది. ప్రిన్స్ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. సినిమా ట్రైలర్ లో అనుదీప్ మార్క్ డైలాగ్స్ కొన్ని కనిపించాయి, తమన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ కు బలం చేకూరనుంది. అయితే దీపావళికి దాదాపు అరడజను సినిమాలు బాక్సాఫీసు ముందుకు రానున్నాయి. సర్దార్, జిన్నా, ఓరిదేవుడా లాంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల పోటీని తట్టుకొని ప్రిన్స్ సినిమా ఎలాంటి గట్టెక్కుతుందో చూడాలి. జాతిరత్నాలు లాంటి కామెడి టైమింగ్ ఉన్నా కథలో బలం లేకపోతే కంగుబాటు తప్పదని నెటిజన్ల ఫీలింగ్. మరి డైరెక్టర్ అనుదీప్ ప్రేక్షకులకు ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?