Vikramarkudu 2 Update: విక్రమార్కుడు 2 అప్‌డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
బ్లాక్ బస్టర్ మూవీస్ ‘విక్రమార్కుడు‘, ‘భజరంగీ భాయీజాన్‘కు సీక్వెల్స్ రాబోతున్నాయా? ఇప్పటికే సినిమా కథలు రెడీ అయ్యాయా? త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? అవునంటున్నారు నిర్మాత రాధామోహన్.
Vikramarkudu-Bajrangi Bhaijaan sequels Scripts Ready: బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘రుస్లాన్‘. సుశీ మిశ్రా హీరోయిన్ గా కనిపించనుంది. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. కె.కె.రాధామోహన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసార్ హాజరయ్యారు.
బ్లాక్ బస్టర్ మూవీస్ కథలు రెడీ
‘రుస్లాన్‘ ప్రమోషనల్ వేడుకలో నిర్మాత కె.కె.రాధామోహన్ సినీ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘విక్రమార్కుడు’కు సీక్వెల్ స్టోరీ రెడీ అయినట్లు చెప్పారు. ఈ సినిమా హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’గా వస్తుందన్నారు. సల్మాన్ హిట్ మూవీ ‘భజరంగీ భాయీజాన్ 2’ కథ కూడా సిద్ధం అయినట్లు వివరించారు. ఈ విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా కన్ఫామ్ చేయడం విశేషం. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు.
రవితేజ కెరీర్ లో మెమరబుల్ మూవీ ‘విక్రమార్కుడు’
స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘విక్రమార్కుడు’. ఈ సినిమా రవితేజ కెరీర్ మాంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆయనను తిరుగులేని స్టార్ ను చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రాజమౌళి చాలా ఏండ్ల కిందటే చెప్పారు. కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయాలేదు. రచయిత విజయేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఈ సినిమా గురించి చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమాకు సీక్వెల్ కథ రెడీ అయినట్లు చెప్పడం విశేషం. “విజయేంద్ర ప్రసాద్ గారు ‘విక్రమార్కుడు 2’కి కథని రెడీ చేశారు. తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ గా ఉండబోతుంది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం ‘భజరంగి భాయీజాన్’ సీక్వెల్ కథని కూడా సిద్ధం చేశారు. త్వరలోనే సల్మాన్ ఖాన్ కు వినిపించే అవకాశం ఉంది” అని చెప్పారు.
అయితే, ‘విక్రమార్కుడు 2’, ‘భజరంగి భాయీజాన్ 2’ సినిమాలను గత దర్శకులే తెరకెక్కిస్తారా? ఈ సినిమాల్లో నటీనటులు పాత వాళ్లే ఉంటారా? కొత్త వాళ్లను తీసుకుంటారా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అప్ డేట్ తో సల్మాన్ ఖాన్, రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలు మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగించడం ఖాయం అంటున్నారు.