Brahmamudi November 6th : కావ్య ఫోటోను కాల్చేసిన రాజ్ – తల్లిని ఇంట్లోంచి గెంటేసిన స్వప్న
తనను తీసుకెళ్లడానికి వచ్చిన కనకాన్ని, స్వప్న ఇంట్లోంచి గెంటివేయడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
స్వప్న దగ్గరకు కోపంగా వెళ్లిన కనకం ఆమె వెటకారంగా మాట్లాడటంతో స్వప్నను కొడుతుంది. అమ్మ కొట్టేంత తప్పు నేనేం చేశాను అని విదిలించుకుని అడుగుతుంది. లేని కడుపు ఉందని నాటకం ఆడటమే కాకుండా అందులో కావ్యను కూడా ఇరికిస్తావా అంటూ కోప్పడుతుంది.
స్వప్న: మరేం చేయమంటావే.. అందరూ కలిసి నామీద పడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అయినా నీ చిన్న కూతురు నువ్వు అనుకునేంత గొప్పదేం కాదులే. తనకెక్కడ సమస్య వస్తుందోనని నిజం దాచింది.
కనకం: నోరు మూయవే పాపిస్టి దానా..? కావ్య మీద నిందలు వేస్తే పుట్టగతులుండవు.
అంటూ చీపురు తీసుకుని స్వప్నను కొడుతుంది. స్వప్న తప్పించుకుని అమ్మ నన్ను కాదు కొట్టేది నిన్ను నువ్వు కొట్టుకోవాలి. నీవల్లే ఇదంతా జరిగింది. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన విధానమే ఇవాళ నేను ఇలా మారడానికి కారణం. నువ్వే కదా అంటూ నిలదీస్తుంది. ఆఖరికి డబ్బున్న వాళ్లలా నటించమని చెప్పింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించగానే..
కనకం: నువ్వు మారవే... ఇక నువ్వు మారవు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే కావ్యను సుఖంగా బతకనివ్వవు. నిన్ను ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడికే తీసుకెళ్తాను.
అంటూ కనకం, స్వప్నను లాక్కెళ్లబోతుంటే కనకాన్ని, స్వప్న బెడ్‌రూంలోంచి బయటకు గెంటేస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే మర్యాద ఉండదని వార్నింగ్ ఇస్తుంది. చుట్టపు చూపుగా వస్తే నీకు గౌరవం ఇస్తా అంటుంది స్వప్న.
కనకం బాధపడుతూ లోపలి నుంచి రావడం చూసిన కావ్య తల్లిని ఓదారుస్తూ..
కావ్య: అమ్మ నువ్వు ఎప్పుడొచ్చావ్ ఇక్కడికి..
కనకం: నా జీవితంలో నేను క్షమించరాని తప్పు ఏదైనా చేశానంటే అది నీకేనమ్మా నన్ను క్షమించు..
అంటూ ఏడుస్తూ కనకం వెళ్లిపోతుంది. కనకం ఇంటికి రాగానే వాళ్లాయన ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. స్వప్నను అక్కడి నుంచి తీసుకొద్దామని వెళ్లానని ఏడుస్తూ.. స్వప్న తిట్టిన మాటలను చెప్తుంది. అంత జరిగినా నువ్వెందుకు ఊరుకున్నావని అప్పు కోప్పడుతుంది. ఇంత జరిగినా నువ్వు ఊరుకుంటావేమో.. నేను ఊరుకోనని అనడంతో కనకం అప్పును ఓదారుస్తుంది.
కావ్య, కనకానికి ఫోన్ చేస్తుంది.
కనకం: కావ్య చెప్పమ్మ
కావ్య: నేను కాదమ్మ నువ్వే చెప్పాలి. ఎందుకు వచ్చావ్. ఎందుకు వెళ్లిపోయావ్.
కనకం : ఏం నేను మీ ఇంటికి రాకూడదా?
కావ్య: రావొచ్చమ్మా కానీ అంతలా బాధపడుతూ మళ్లీ ఎందుకు వెళ్లావ్. నిన్ను మళ్లీ ఎవరైనా ఏమైనా అన్నారా?
కనకం: జరిగిన దారుణం చాలాదా? మళ్లీ కొత్తగా జరగాలా?
అంటూ నేను స్వప్నతో మాట్లాడదామని వచ్చానని కనకం చెప్తుంది. దానికి ఏదో నచ్చచెబుదామని వచ్చాను. అనగానే నువ్వు చెబితే అది వినే రకం అయితే ఇన్ని సమస్యలు వచ్చేవా? అమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తుంది కావ్య.
బామ్మ, అపర్ణ, ధాన్యలక్ష్మీ ముగ్గురు కలిసి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంటారు. కావ్య చాలా మంచిదని ధాన్యలక్ష్మీ, బామ్మ, అపర్ణకు చెప్తారు. నువ్వు కావ్యను అపార్థం చేసుకోవద్దని చెప్తారు. ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటున్నారో చూస్తునే ఉన్నావు కానీ కావ్య ఎప్పుడూ అలా ఉండదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మీరెన్ని చెప్పినా నేను వినను. ఆ కావ్య ముఖం చూడలేకపోతున్నాను అంటూ అపర్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజ్ బెడ్ రూంలో కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉండగా తన పెళ్లి ఫోటో కనిపించగానే కోపంగా ఫోటోను తీసుకుని కాల్చివేస్తాడు. రాజ్ చేయి కాలుతుంది. దూరం నుంచి చూస్తున్న కావ్య కంగారుగా లోపలికి వస్తూ..
కావ్య: అయ్యో ఏవండి ఏమైంది.
రాజ్: నిజం
కావ్య: నిప్పైందా?
రాజ్: నువ్వు చేసిన తప్పైంది.
కావ్య: అది మీ చేతిని కాల్చేసింది.
రాజ్: నువ్వు నిప్పు అనుకుంటున్నావా?
కావ్య: అంటున్నాను. అనుకోవడం లేదు. నిప్పుని ఏది అంటదు.
రాజ్: అని నువ్వు అనుకుంటున్నావ్. అబద్దం చెప్పానని నువ్వే ఒప్పుకున్నావ్.
అంటూ రాజ్ అనగానే మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారని కావ్య బాధపడుతుంది. నేను అందరిలాగా కాదని నేను తప్పు చేయలేదు అంటుంది కావ్య. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను అంటూ రాజ్ వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.