Devil Movie : స్టార్ టెక్నీషియన్స్ తో కళ్యాణ్ రామ్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..
పీరియాడిక్ సినిమాలు చేసేప్పుడు అప్పటి లుక్ ను తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ పాత్రలు ఎంతో కీలకమని చెప్పాలి.
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో చాలా పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాల కంటే పీరియాడిక్ సినిమాల కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పీరియాడిక్ సినిమాలు చేసేప్పుడు అప్పటి లుక్ ను తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ పాత్రలు ఎంతో కీలకమని చెప్పాలి. 'పుష్ప', 'రంగస్థలం', 'ఉప్పెన', 'తలైవి', 'అంతరిక్షం 9000 kmph' ఇలా చాలా సినిమాలకు తమ ఆర్ట్ వర్క్ తో ఓ డిఫరెంట్ లుక్ ను తీసుకొచ్చిన ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకి పని చేయనున్నారు.
ఓ పక్క నిర్మాతగా.. మరోపక్క హీరోగా దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్.. వరుస ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకేసారి ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో 'డెవిల్' సినిమా ఒకటి. అభిషేక్ నామా నిర్మాతగా నవీన్ మేడారం దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ టీజర్ ను కూడా విడుదల చేశారు. కోటు, పంచె ధరించి చేతిలో రివాల్వర్ పట్టుకొని సరికొత్త గెటప్ లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచారు.
ఈ పీరియాడిక్ సినిమా కోసం 1945లో బ్రిటీష్ వాళ్లు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ సెట్ ను ఈ సినిమా కోసం రామకృష్ణ, మోనిక రూపొందించనున్నారు. ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి నియమించబడ్డ ఓ సీక్రెట్ ఏజెంటే 'డెవిల్' ఈ రహస్యం అతను ఊహించిన దానికంటే మరింత లోతుగా ఉంటుందట. ఈ ప్రయాణంలో అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని చెబుతున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ ఇప్పటికే పీరియాడిక్ సినిమా 'బింబిసార'ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటు మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా.. అలానే దిల్ రాజు నిర్మాణంలో ఒకటి, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మరొక సినిమా చేయడానికి అంగీకరించాడు.