By: ABP Desam | Updated at : 06 Feb 2022 10:28 AM (IST)
మెలోడీ క్వీన్ గొంతు మూగబోయింది
భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్(92) ఈరోజు కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. మెలోడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీ సంగీత దర్శకుడు ఆమెతో పాటలు పాడించుకోవాలని కోరుకునేవారు.
తన కెరీర్ లో దాదాపు ఇరవై భాషల్లో వేల పాటలు పాడారామె. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కూడా ఈమె కొన్ని పాటలు పాడారు. 1955లో ఏఎన్నార్ హీరోగా రూపొందిన 'సంతానం' చిత్రంలో లతా మంగేష్కర్ తొలిసారి తెలుగు పాట పాడారు. ఆ తరువాత నాగార్జున హీరోగా నటించిన 'ఆఖరిపోరాటం'లో పాడారు.
లతా మంగేష్కర్ సినీ ప్రయాణం..
లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు.1929 సెప్టెంబరు 28న జన్మించిన లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు లతా మంగేష్కర్. నిజానికి ఆమె అసలు పేరు హేమ. కానీ తన తండ్రి నటించిన 'భవ బంధన్' అనే నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటినుంచి ఆమె పేరు లతగా మారిపోయింది. ఐదేళ్ల వయసు నుంచే లతా నాటకాల్లో నటించడం, పాటలు పాడడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన ఆమె ఎక్కువ కాలం ముంబైలోనే గడిపారు.
తన పదమూడేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది లతా. ఆ సమయంలో కుటుంబ పోషణ బాధ్యత లతాపై పడింది. దీంతో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించింది. 1942లో మరాఠీ సినిమా 'కిటి హసల్' సినిమాలో లతా మొదటి పాట పాడారు. అయితే సినిమాలో ఆ పాటను కట్ చేశారు. దీంతో ఆ పాట ఎప్పటికీ రిలీజ్ కాలేదు. ఆ తరువాత హిందీ సినిమాలో పాటలు పాడే అవకాశం దక్కించుకున్నారు. 'మహాల్' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
'ఆగ్', 'శ్రీ 420', 'చోరి చోరి', 'హైవే నెంబర్ 44', 'దేవదాస్' వంటి సినిమాలు లతా క్రేజ్ ను పెంచేశాయి. 1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన 'మొఘల్-ఏ-ఆజమ్' సినిమాలో పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' అనే పాట లతా మంగేష్కర్ స్థాయిని మరింత పెంచింది. 1990లో లతా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. తన ప్రొడక్షన్ లో గుల్జార్ దర్శకత్వంలో 'లేఖిని' అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో ఆమె పడిన పాటకు నేషనల్ అవార్డు దక్కింది.
జనవరి 27, 1963లో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన 'ఏ మేరే వతన్ కే లోగాన్' అనే దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాటను 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు.
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్డే సర్ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్‌ఎస్‌కు మరో అస్త్రం
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
Netflix: పాస్వర్డ్ షేరింగ్ను నిలిపివేయనున్న నెట్ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!
ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత