Niharika Konidela: వారసత్వం అనేది సక్సెస్ ఇవ్వదు- సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వారసత్వం అనేది సినిమాల్లో సక్సెస్ ఇవ్వదని మెగా డాటర్ నిహారిక అన్నారు. సినిమా అంటే ఇష్టంతో పాటు కష్టపడేతత్వం ఉంటేనే ఇండస్ట్రీలో విజయం సాధిస్తారని చెప్పారు.
Niharika Konidela About Nepotism: సినిమా పరిశ్రమలో వారసత్వంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో మెగా డాటర్ కొణెదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వారసత్వం ఉపయోగపడినా, సక్సెస్ అయ్యేందుకు సాయపడదని చెప్పారు. ఇష్టంతో పాటు కష్టపడ్డప్పుడే విజయం అందుతుందని చెప్పారు. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు.
సినిమా అంటే ఫ్యాషన్ ఉండాలి- నిహారిక
“వారసత్వం ద్వారా సినిమా పరిశ్రమలోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు” అని నిహారిక తెలిపారు. తను నిర్మాతగా రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను తన అన్నా వదిన చూశారని, వారికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. “మా అన్నా, వదిన ఈ సినిమాను చూశారు. వాళ్లకు చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది” అని నిహారిక వెల్లడించారు.
కథ చెప్పగానే నచ్చేసింది- నిహారిక
దర్శకుడు వంశీ ఈ సినిమా కథ చెప్పగానే తనకు నచ్చిందని నిహారిక చెప్పారు. “కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఈ సినిమా కథ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని ఫిక్స్ అయ్యా. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నారు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. అంతా కొత్త వారితో ఈ సినిమా చేశాం. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు”అని వెల్లడించారు.
పాత్ర నచ్చితే తప్పకుండా నడిస్తాను- నిహారిక
ఇప్పటికే పలు సినిమాల్లో నటించానని, మంచి కథ, క్యారెక్టర్ దొరికతే తప్పకుండా మళ్లీ వెండితెరపై కనిపిస్తానని నిహారికి వెల్లడించారు. “’ముద్దపప్పు ఆవకాయ్’ టైంలో నేను నటించాను. ఆ టైంలో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. నాకు నటించడమే ఇష్టం. మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను” అని చెప్పుకొచ్చారు.
ఆగష్టు 9న ‘కమిటీ కుర్రోళ్ళు’ విడుదల
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందింది. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Read Also: ‘కమిటీ కుర్రోళ్లు‘ వస్తున్నారు, బాబాయ్ బిజీ.. మా నాన్న దొరకడం లేదు: నిహారిక కొణిదెల