Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 'ఓ సెల్ఫ్ డబ్బా స్టోరీ' - వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ బుక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఆయనలో మంచి చమత్కారం కూడా ఉంటుంది. మైక్ పట్టుకొని ఆయన ఇచ్చే స్పీచ్ లు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఆయన స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 'శూన్యం నుంచి శిఖరాగ్రం వరకూ' అనే పుస్తక ఆవిష్కరణ కోసం చిరంజీవి విచ్చేశారు.
ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ.. నటీనటుల గొప్పదనం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కొన్ని కామెంట్స్ చేశారు. తన ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లు ఎంతసేపూ.. రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజ్ ల పాటలే వేయమంటుంటారని.. తన సినిమాల గురించి, పాటల గురించి ఎవరూ పట్టించుకోరని అన్నారు. దాంతో తనకొక రకమైన జెలసీ ఫీలింగ్ వచ్చేదని.. దీంతో ఎవరూ లేని టైం చూసి(పెద్దవాళ్లుంటే మీ గురించి మీరు చెప్పుకోవడం ఏంటండి అని అంటారని) పిల్లలందరినీ కూర్చోబెట్టి తను నటించిన ఫేమస్ డాన్స్ నెంబర్స్ కొన్ని వేసి చూపించానని అన్నారు చిరంజీవి.
వారంతా తాతయ్య అని పిలవరని 'భయ్యా' అంటారని చిరు చెప్పారు. తన డాన్స్ నెంబర్స్ చూసిన పిల్లలు 'భయ్యా ఇది నువ్వేనా..?' అంటూ ఆశ్చర్యపోయారని.. అలా తన గురించి తనే ఇంట్లో వాళ్లముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సరదాగా చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇదే సమయంలో ఇంట్లో పిల్లలందరికీ 'గాడ్ ఫాదర్' సినిమా బాగా నచ్చిందని.. ఒక్కొక్కరూ నాలుగైదు సార్లు చూశారని అన్నారు. చిరు ఇచ్చిన ఈ స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: 'ఆదిపురుష్' సినిమాకి షాకింగ్ రన్ టైం - మూడు గంటలకు పైగానే!
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'వాల్తేర్ వీరయ్య' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరు ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.