వీడియో: సీరియల్ షూటింగ్ మధ్యలో చిరుత పులి ఎంట్రీ - భయంతో పరుగులు పెట్టిన నటీనటులు, సిబ్బంది
ఇటీవల ముంబైలోని ఓ సీరియల్ షూటింగ్ సెట్స్ లో వింత సంఘటన జరిగింది. షూటింట్ స్పాట్ లోకి ఓ చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. దీంతో..
ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ ల సమయంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా వరకూ ఇవే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. టీవీ సీరియల్స్ షూటింగ్స్ లలో అవి అంతపెద్దగా కనిపించవనే చెప్పాలి. అయితే ముంబైలో టీవీ సీరియల్స్ వాళ్లకి మాత్రం వింత సంఘటనలు ఎదురవుతున్నాయట. పులులు, కొండ చిలువలు తమ షూటింగ్ స్పాట్ లలోకి వచ్చి యాక్టర్స్ ను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఓ టీవీ సీరియల్ షూటింగ్ లో చిరుతపులి హల్చల్ చేయడంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లో పులి సంచరిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
షూటింగ్ స్పాట్ లోకి చిరుతపులి..
ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ‘సుఖ్ మాంజే కాయ్ ఆస్తా’ అనే సీరియల్ షూటింగ్ జరుపుకుంటోంది. రోజులాగే మంగళవారం కూడా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సమయంలో ఓ చిరుత పులి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సెట్లోకి వచ్చింది. ఆ చిరుత పులి తన పిల్లలతో కలిసి సెట్ లో అటూ తిరుగుతూ కనిపించింది. షూటింగ్ స్పాట్ లోకి పులి ఎంటర్ అవ్వడం చూసి అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు పెట్టారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 200 మంది వరకూ ఉన్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అయితే ఆ పులి షూటింగ్ స్పాట్ లో సంచరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో చాలా సార్లు జరిగాయి..
ఇలా షూటింగ్ స్పాట్ లోకి అటవీ జంతువులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గత పది రోజుల్లో ఇలా పులి సెట్ లోకి రావడం ఇది నాలుగో సారి అని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి చెబుతున్నారు. గతంలో ఇలాగే ‘అజుని’ అనే సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతు పులి వచ్చిందని చెబుతున్నారు. అలాగే పాములు కూడా చాలా సార్లు సెట్స్ లో కనిపించాయని, ఓసారి అయితే ఏకంగా కొండచిలువ సెట్ లో ప్రత్యక్షమైందని చెబుతున్నారు. అందుకే ఇక్కడ షూటింగ్ కు రావాలి అంటేనే యాక్టర్స్ భయపడిపోతున్నారని అంటున్నారు. అటవీ అధికారులు వీటిపై సరైన శ్రద్ద పెట్టి దీనికి శాస్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారట సీరియల్స్ మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లో చిరుత పులి తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial