Krishnam Raju Special : పైరసీకి బలైన తొలి సినిమా కృష్ణం రాజుదే
Krishnam Raju Death : ఇప్పుడు ప్రతి సినిమా పైరసీ బారి నుంచి తప్పించుకోవడం కష్టం అవుతోంది. ఆన్‌లైన్ పైరసీ కంటే ముందు వీడియో పైరసీ ఉండేది. దానికి బలైన తొలి సినిమా కృష్ణం రాజుదే.
పైరసీ... పైరసీ... పైరసీ... ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న భూతాలలో ఇదీ ఒకటి. ప్రపంచంలో సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదల అయినా సరే కొన్ని క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి ప్రింట్ వచ్చేస్తుంది. ప్రతి సినిమా పైరసీకి బలవుతోంది. అసలు, తెలుగులో పైరసీకి గురైన తొలి సినిమా ఎవరిదో తెలుసా? కృష్ణం రాజుదే.
కృష్ణం రాజు (Krishnam Raju) కథానాయకుడిగా టైటిల్ పాత్రలో నటించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా 'తాండ్ర పాపారాయుడు' (Tandra Paparayudu Movie). తెలుగులో అప్పుడప్పుడే పారంభం అయిన వీడియో పైరసీ (Video Piracy) కి బలైన తొలి సినిమా ఇది. దాంతో భారీగా ఖర్చు పెట్టినప్పటికీ... ఆ స్థాయిలో డబ్బులు రాలేదు. ఆర్థికంగా తనకు లాభాలు రానప్పటికీ... పేరు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
'తాండ్ర పాపారాయుడు' సినిమా వెనుక కథేంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా విడుదల విషయంలో పర్సెంటేజ్ పద్ధతి ఎత్తేసి శ్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత విడుదలైన తొలి సినిమా 'బొబ్బిలి బ్రహ్మన్న'. ఆ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లో తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందనేది చెప్పిన సినిమాల్లో అదొకటి. ఆ విజయం ఉత్సాహం ఇవ్వడంతో హాలీవుడ్ సినిమా 'టెన్ కమాండ్‌మెంట్స్', బాలీవుడ్ సూపర్ హిట్ 'మొఘల్ ఏ అజాం' తరహాలో భారీ సినిమా తీయాలని కృష్ణం రాజు సంకల్పించారు. అందుకు సాంఘీక కథ అంటే చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుంటే... బావుంటుందని 'తాండ్ర పాపారాయుడు' కథ ఎంపిక చేసుకున్నారు.
ఆల్రెడీ హిట్స్ ఇచ్చిన దాసరి దర్శకత్వంలో...
'తాండ్ర పాపారాయుడు' సినిమా చేయాలనుకున్న తర్వాత... కొండవీటి వెంకట కవితో ఏడాది పాటు కథ వర్క్ చేయించారు. చరిత్రను క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత స్క్రిప్ట్ రెడీ చేయించారు. అప్పటికి కృష్ణం రాజుకు 'కటకటాల రుద్రయ్య', 'రంగూన్ రౌడీ' వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఆయన అయితే 'తాండ్ర పాపారాయుడు' వంటి భారీ చిత్రాన్ని తీయగలరని సంప్రదించారు.
Also Read : సినిమాల్లో రాజుగారి అబ్బాయ్ విలన్ - హీరోగా వరుస విజయాలు - కృష్ణం రాజు కెరీర్‌లో ఇదీ స్పెషల్
'తాండ్ర పాపారాయుడు' తర్వాత సినిమాలో అంతే ప్రాముఖ్యం ఉన్న విజయ రామరాజు పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించారు. జయప్రద, జయసుధ, సుమలత ఇతర పాత్రల్లో నటించారు.
రాజస్థాన్, ఒరిస్సా నుంచి గుర్రాలు
'తాండ్ర పాపారాయుడు' కోసం రాజస్థాన్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలను తెప్పించారు. సినిమా స్క్రిప్ట్ పరంగా మాత్రమే కాదు, షూటింగ్ కోసం కూడా హిస్టరీని ఫాలో అయ్యారు. రాజమండ్రిలో బుస్సీదొర ఎక్కడ క్యాంప్ వేశారో... సినిమా కోసం అక్కడే సెట్స్ వేసి షూటింగ్ చేశారు. భారీ సెట్స్, వేలాది మంది జునియర్ ఆర్టిస్టులతో ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. కమర్షియల్ పరంగా సినిమా సాధించిన విజయం పక్కన పెడితే... కథానాయకుడిగా, నిర్మాతగా కృష్ణం రాజుకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
Also Read : ‘నాయాల్ది, కత్తందుకో జానకి’ - అందుకే, కృష్ణం రాజు రెబల్ స్టార్!