Korameenu Trailer : చేసుకోబోయే అమ్మాయిని రాత్రికి తీసుకు రమ్మంటే?
ఆనంద్ రవి కథానాయకుడిగా నటించిన 'కోరమీను' డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఆనంద్ రవి (Anand Ravi) కథానాయకుడిగా నటించిన చిత్రం 'కోరమీను' . ఏ స్టోరీ ఆఫ్ ఈగోస్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు యువ కథానాయకుడు, పాన్ ఇండియా సెన్సషన్ అడివి శేష్ చేతులు మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
కరుణ, కోటి మధ్య గొడవలో మీసాల రాజు!
Korameenu Trailer Review : 'కోరమీను' ట్రైలర్‌లో ఎవరి ఎవరి మధ్య ఈగోలు ఉన్నాయి? ఎందుకు గొడవలు వచ్చాయి? అనేది చాలా క్లారిటీగా చెప్పేశారు. కథ ఎలా ఉంటుందనేది కూడా హింట్ ఇచ్చేశారు.
ట్రైలర్ కథకు వస్తే... విజయవాడలో నేరస్థుల పాలిట సింహస్వప్నంగా మారిన ఐపీఎస్ మీసాల రాజు అలియాస్ సీతా రామ రాజు విశాఖకు ట్రాన్స్‌ఫర్ అవుతారు. విచిత్రం ఏమిటంటే... విశాఖకు వచ్చిన ఆయనకు మీసాలు లేవు. ఎందుకు? అనేది సస్పెన్స్. ఆయన మీసాలు ఎవరు తీసేశారు? అనేది చెప్పలేదు. తన మీసాలు తీసేయడంతో ఈగోకి వెళ్ళిన ఆ పనికి కారకులు ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాడు. అప్పుడు విశాఖలో కరుణ, కోటి గురించి తెలుస్తుంది.
జాలరిపేటలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏదో ఇష్యూ జరుగుతుందని ఆ కేసు టేకప్ చేస్తాడు మీసాల రాజు. జాలరిపేటకు యువరాజులా ఫీలయ్యే కరుణ (హరీష్ ఉత్తమన్) కు కోటి (ఆనంద్ రవి) రైట్ హ్యాండ్ లాంటోడు. అయితే... కరుణతో గొడవ పడి పని మానేశాడు. ఎందుకు? అంటే... మీనాక్షి అంటే కోటికి ప్రేమ. తానూ ప్రేమించే అమ్మాయి అని తెలిసిన తర్వాత కూడా రాత్రికి తీసుకు రమ్మని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. 'నేను చేసుకోబోయే అమ్మాయి అని చెప్పిన తర్వాత కూడా రాత్రికి తీసుకుని రా అన్నావ్' అని ఆనంది రవి చెప్పే మాటలో కథ రివీల్ చేశారు. కరుణ, కోటి మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో చెప్పేశారు.
కరుణ, కోటి మధ్య గొడవలో మీసాల రాజు పాత్ర ఏమిటి? కోటి, మీనాక్షిని వారంలో ఊరు వదిలి వెళ్ళిపోమని కరుణ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏమైంది? అనేది వెండితెరపై సినిమా చూసి తెలుసుకోవాలి.
'దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ పేదోడికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు సార్', 'ఎవరు నువ్వు? డబ్బునోడివి అంతే!', 'భయంతో బతకడం కంటే ధైర్యంగా చావడం మేలు అని నువ్వే నాకు చెప్పావ్', 'మర్డర్, మానభంగం చేస్తేనే కాదురా నేరం... అవతలి వాడి ఫీలింగ్స్ హర్ట్ చేసినా నేరమే' వంటి మాటల్లో రచయితగా హీరో ఆనంద్ రవి పవర్ చూపించారు.
Also Read : వినాయక్‌కు ముందు తెలుసేమో!? - పెళ్లి, పిల్లలు, ఆ 'అదుర్స్' మీమ్స్‌పై నయనతార రియాక్షన్ చూశారా?
ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రకటనకు ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని 'కోరమీను' ఆకర్షిస్తోంది. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అనే పోస్టర్‌తో వినూత్నంగా ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలైన టీజర్, పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : 'కనెక్ట్' మినీ రివ్యూ : నయనతార సినిమా ఎలా ఉందంటే?
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని, నిర్మాణ సంస్థ : ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ - కథనం - మాటలు : ఆనంద్ రవి, దర్శకత్వం : శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.