Nayanthara On Adhurs Memes : వినాయక్‌కు ముందు తెలుసేమో!? - పెళ్లి, పిల్లలు, ఆ 'అదుర్స్' మీమ్స్‌పై నయనతార రియాక్షన్ చూశారా?
Nayanthara On Marriage Memes : ఇప్పుడు నయనతార ఓ ఇంటి కోడలు. విఘ్నేష్ శివన్ భార్య. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయన్ పెళ్ళి తర్వాత వచ్చిన మీమ్స్ మీద ఆవిడ రియాక్షన్ చూశారా?
తెలుగులో నయనతార (Nayanthara) కథానాయికగా నటించిన సినిమాల్లో 'అదుర్స్' ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఎన్టీఆర్, నయన్ మధ్య సన్నివేశాలతో పాటలు ఎంత బావుంటాయో... నయన్, బ్రహ్మి మధ్య సన్నివేశాలు అంత కంటే ఎక్కువ నవ్విస్తాయి. చంద్రకళ క్యారెక్టర్ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పెళ్లి తర్వాత 'అదుర్స్'లో సన్నివేశాలు మీమర్స్‌కు మంచి మెటీరియల్ ఇచ్చాయి. బోలెడు మీమ్స్ వచ్చాయి. వాటి మీద నయనతార రియాక్ట్ అయ్యారు.
వినాయక్‌కు ముందు తెలుసేమో!?
నయనతార ప్రధాన పాత్రలో ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మించిన 'కనెక్ట్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో గురువారం విడుదల అవుతోంది. ఎప్పుడూ ప్రచార కార్యక్రమాలకు హాజరు కాని నయన్... ఈ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. అందులో తెలుగు హీరోల గురించి, తన పెళ్లి తర్వాత పిలల్లు పుట్టిన తర్వాత వచ్చిన మీమ్స్ గురించి స్పందించారు.
మీ పెళ్ళి అయిన తర్వాత భట్టు ('అదుర్స్'లో బ్రహ్మానందం పాత్రధారి) జనాలను తీసుకుని మీ ఇంటికి బయలు దేరినట్టు మీమ్స్ క్రియేట్ చేశారని నయనతారకు సుమ చూపించగా... లేడీ సూపర్ స్టార్‌కు నవ్వు ఆగలేదు. సరోగసీ ద్వారా నయన్ కవల పిల్లలకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరినీ బ్రహ్మి ఆడిస్తున్నట్లు ఫోటోలు చూపించగా... ''వీవీ వినాయక్ గారికి ముందే తెలుసు ఏమో!?'' అని నయన్ సరదాగా నవ్వేశారు.
Also Read : 'మా బావ మనోభావాలు' - బాలకృష్ణ టార్గెట్ ఎవరు?
'అదుర్స్' షూటింగ్ సమయంలో సంగతులనూ నయనతార గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చేసేటప్పుడు బ్రహ్మానందం గారి ముఖం చూస్తే తనకు నవ్వు వచ్చేదని, ఆయన చాలా క్యూట్ ఉంటారని ఆమె పేర్కొన్నారు. సాంగ్స్ షూట్ చేసే ముందు ఎన్టీఆర్‌కు అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే అలవాటు లేదన్నారు. ఒక్కసారి స్టెప్స్ చూసి ఈజీగా వేసేవాడని చెప్పారు.
తెలుగు హీరోలు అందరి గురించి నయనతార ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి :
'కనెక్ట్' సినిమా విషయానికి వస్తే... తొలుత ఇంటర్వెల్ లేకుండా 99 నిమిషాల సినిమాను థియేటర్లలో ప్రదర్శించాలని చిత్ర బృందం భావించింది. అయితే... థియేటర్ల యజమానుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో గంట తర్వాత ఇంటర్వెల్ ఇచ్చి, ఆ తర్వాత 40 నిమిషాల సినిమా ప్లే చేయాలని ప్లాన్ చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో గురువారం 'కనెక్ట్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ తమిళనాడులో సోమవారం ప్రీమియర్ షో వేశారు. తెలుగులో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులకు సినిమా చూపించారు. 'కనెక్ట్' సినిమా సూపర్ ఉందని చెన్నైలో ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్వీట్లు చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్ ఎక్స్‌లెంట్ అంటున్నారు. అయితే... కథ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. చిన్న పాయింట్ పట్టుకుని దర్శకుడు అశ్విన్ శరవణన్ సినిమా తీశారని బావుందని చెబుతున్న ప్రేక్షకులు సైతం ట్వీట్లు చేయడం గమనార్హం. థియేటర్లలో సినిమా చూడాలని అందరూ చెబుతున్నారు.