Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
Gaddar Road: బీజేపీ ఆఫీస్ పేరులో గద్దర్ పేరు ఉండేలా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Gaddar Road: గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తామన్నారు. రవీంద్రభారతిలో గద్దర జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గద్దర్ పద్మ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిందన్నారు. మొత్తం ఐదుగురికి పద్మ పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి ఐదుగురికి ఇచ్చారని వారి కంటే తాము సిఫారసు చేసిన వాళ్లు తక్కువగా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పు దిద్దుకుంటారని తాను లేఖ కూడా రాశానన్నారు. గద్దర్‌కు ఎలా అవార్డు ఇప్పించుకోవాలో తమకు తెలుసన్నారు.
గద్దర్ కు పద్మశ్రీ ఇచ్చేది లేదని ఆయన నక్సలైట్లతో కలిసి బీజేపీ నేతల్ని, పోలీసుల్ని చంపేశారని అలాంటి వారికి ఎలా అవార్డు ఇస్తారని బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఈ అంశంపై దుమారం రేగింది. గద్దర్ ను కించ పరుస్తున్నారని ఆయన తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని వెచ్చించారని అన్నారు. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ..ఆయనను కించ పరిస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ ఇప్పుడు నాంపల్లిలో ఉంది. గాంధీ భవన్ తో పాటు బీజేపీ ఆఫీసు ఒకే దారిలో ఉంటాయి. ఆ రోడ్డుకు గద్దర్ పేరు పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందేమో కానీ అలా చేస్తే గద్దర్ రోడ్, బీజేపీ కార్యాలయం అని చెప్పుకోవాల్సి వస్తుంది.
గద్దర్ గురించి పలు విషయాలను రేవంత్ గుర్తు చేసుకున్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు. గద్దర్ మృతదేహాన్ని తీసుకెళ్తే గత కేసీఆర్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియానికి తాళం వేసిందని .. గద్దరన్న చివరిచూపు ప్రజలందరికీ దక్కాలని ఎల్బీ స్టేడియానికి తీసుకొచ్చామన్నారు. గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని గుర్తు చేసుకున్నారు. గద్దర్ తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని చెప్పారు. సమాజమే తన కుటుంబంగా భావించారని.. ఒంటరి అనే భావన తనకు వచ్చినప్పుడల్లా.. గద్దర్ దగ్గరకు వెళ్లేవాడిననని గుర్తుచేసుకున్నారు.
గద్దర్ పేరుతో తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉగాది సందర్భంగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. గద్దర్‌కు కులం, మతం లేదు.. ఆయన విశ్వ మానవుడని గద్దర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని అన్నారు. పాట, మాటతో లక్షలాదిమందిని ప్రభావితం చేశారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం గద్దర్ ప్రత్యేక పాట రాశారని గుర్తు చేసుకున్నారు.
Also Read: ఫిరాయింపులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ? - తెలంగాణ అసెంబ్లీ సెక్రటరికి సుప్రీంకోర్టు ప్రశ్న
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

