Darshan Case: దర్శన్ కేసులో మరో ట్విస్ట్, మేనేజర్ అనుమానాస్పద మృతి, రేణుకా స్వామి హత్య కేసుకు లింక్ ఉందా?
కన్నడ నటుడు దర్శన్ కేసు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన మేనేజర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ మృతికి రేణుకాస్వామి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Darshan’s Manager Dies By Suicide: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పంపిన రేణుకాస్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మరో షాక్ తగిలింది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. దర్శన్ ఫామ్ హౌస్ లోనే ఆయన చనిపోవడం సంచలనం కలిగిస్తోంది.
రేణుకాస్వామి హత్యకు మేనేజర్ మృతికి సంబంధం ఉందా?
దర్శన్ అరెస్టు తర్వాత మేనేజర్ శ్రీధర ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దర్శన్, నటి పవిత్ర గౌడ, ఆమె పని మనిషి పవన్, చిత్రదుర్గ దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, దర్శన్ మేనేజర్ కు ఈ హత్య కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు. అయినప్పటికీ, ఆయన నిన్న(జూన్ 18న) సాయంత్రం దర్శన్ ఫామ్ హౌస్ లోనే శవమై కనిపించారు. అంతేకాదు, ఆయన చేతితో రాసిన ఓ సూసైడ్ నోట్, వీడియో మెసేజ్ లభించాయి. గత కొంత కాలంగా ఒంటరితనం తనను వేధిస్తుందని.. అందుకే తాను చనిపోతున్నట్లు శ్రీధర్ తన సూసైడ్ లెటర్ లో రాశారు. అయితే, అసలు వాస్తవం అది కాదనే టాక్ వినిపిస్తోంది. ఆయన మృతికి రేణుకాస్వామి హత్య కేసుకు బలమైన సంబంధం ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా శ్రీధర్ మృతిని రేణుకాస్వామి హత్య కేసుతో లింక్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
2018లో అదృశ్యమైన దర్శన్ మాజీ మేనేజర్ మల్లికార్జున్
దర్శన్ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు మరో విషయం తెలిసింది. ఆయన దగ్గర పని చేసిన మేనేజర్ మల్లికార్జున్ కూడా 2018 నుంచి కనిపించడం లేదని వెల్లడైంది. దర్శన్ కు సంబంధించిన సుమారు రూ. 2 కోట్ల డబ్బు తీసుకుని అదృశ్యం అయినట్లు టాక్ వినిపిస్తోంది. అప్పట్లో దర్శన్ పేరును వాడుకొని సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూళు చేసినట్లు మల్లికార్జున్ పై ఆరోపణలు వచ్చాయి. కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా దగ్గర కూడా కోటి రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన కోర్టులో కేసు కూడా వేశారు. అదే సమయంలో ‘ప్రేమ బహర’ అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను దర్శన్ నిర్మాణ సంస్థ తూగదీప ప్రొడక్షన్ తీసుకుంది. ఈ పనులన్నీ మల్లికార్జున్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా రైట్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో మల్లికార్జున్ పారిపోయాడు. అప్పటి నుంచి మల్లికార్జున్ కనిపించలేదు. ఆయనపై దర్శన్ కూడా కేసు పెట్టలేదు. ఇంతకీ అతను ఏమయ్యాడు? అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచింది. తాజాగా దర్శన్ అరెస్టు కావడంతో మాజీ మేనేజర్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది.