Kiccha Sudeep: భూమ్మీదకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి, అతడికి శిక్ష పడాల్సిందే - దర్శన్ అరెస్టుపై కిచ్చా సుదీప్ కీలక వ్యాఖ్యలు
రేణుకాస్వామి మర్డర్ కేసుపై స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందన్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
Actor Kiccha Sudeep On Darshan Arrest: కన్నడ నటి పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్ లు పంపిన రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేశాడనే ఆరోపణలపై శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ ను రీసెంట్ గా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ అవుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు కన్నడ సినీ సెలబ్రిటీలు స్పందించగా, తాజాగా స్టార్ హీరో కిచ్చా సుదీప్ రియాక్ట్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటనతో కన్నడ సినిమా పరిశ్రమ సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం జరగాలి, న్యాయం గెలవాలి- సుదీప్
రేణుకాస్వామి హత్య కేసు వ్యవహారానికి సంబంధించి కన్నడ సినిమా పరిశ్రమ అంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు సుదీప్. ప్రస్తుతానికి తాము మీడియాలో చూపించే విషయాలనే నమ్ముతున్నట్లు వెల్లడించారు. “ప్రస్తుతం మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయో వాటినే మేం నమ్ముతున్నాం. వాస్తవాలను బయటకు తెచ్చేందుకు పోలీసులతో పాటు మీడియా కూడా చాలా కష్టపడుతోంది. బాధితుడికి న్యాయం జరగాలని మేమంతా కోరుకుకుంటున్నాం. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న మృతుడి భార్యకు న్యాయం జరగాలి. ఇంకా భూమ్మీదకు రాని బిడ్డకు న్యాయం దక్కాలి. దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఇలాంటి వ్యవహారాల్లో చిన్న పెద్దా అనే తేడాను పాటించకూడదు. అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయడమే ప్రధానం. ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారం కన్నడ సినిమా పరిశ్రమను క్లిష్టపరిస్థితుల్లోని నెట్టివేసింది. కన్నడ సినిమా పరిశ్రమ ఒకరిద్దరికి సంబంధించినది కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎన్నో అవమానాలను, నిందలను పడుతోంది. వాటన్నింటి నుంచి త్వరలోనే క్లీన్ చిట్ రావాలని ఆశిస్తున్నాం” అని కిచ్చా సుదీప్ అన్నారు.
నిష్పక్షపాతంగా విచారణ జరగాలి- ఉపేంద్ర
ఇప్పటికే దర్శన్ అరెస్టుపై ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అత్యంత సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు. “గత కొద్ది రోజులుగా జరుగుతున్న రేణుకాస్వామి హత్య కేసు విచారణను కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగి దోషులకు శిక్ష పడాలి. హైప్రొఫైల్ వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో విచారణ తప్పుదారి పట్టే అవకాశం ఉందని రేణుకాస్వామి కుటుంబ సభ్యులు భావించే అవకాశం ఉంది. అలాంటి అనుమానాలకు తావివ్వకుండా పోలీసులు విచారణ కొనసాగించాలి. ఎప్పటికప్పుడు కేసు వివరాలను పారదర్శకంగా మీడియా ద్వారా ప్రజల ముందుకు ఉంచడం మంచిది” అన్నారు.
అసభ్య మెసేజ్ లే హత్యకు కారణం
కన్నడ నటి పవిత్ర గౌడ, స్టార్ హీరో దర్శన్ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శన్ కు పెళ్లై భార్య కూడా ఉన్నది. వీరి జీవితాల్లోకి పవిత్ర ప్రవేశించి వారి కుటుంబాన్ని నాశనం చేసిందని దర్శన్ అభిమాని రేణుకాస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవిత్ర గౌడ తీరును నిరసిస్తూ ఆమెకు ఇన్ స్టా వేదికగా అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన దర్శన్ అతడిని హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: హత్యకు దారితీసిన ఆ మెసేజ్‌లో ఏముంది? హీరో దర్శన్ అంత దారుణమైన నిర్ణయం తీసుకోడానికి కారణం ఇదేనా?