Allu Arjun: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ భేటీ - ఇంకో #BB కాంబో రెడీ అవుతుందా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు.
Sanjay Leela Bhansali: పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం... రెండో భాగానికి స్క్రిప్టును రూపొందించడంలో సుకుమార్ బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్‌ను బన్నీ పూర్తిగా వాడేసుకుంటున్నాడు.
అఖండతో మాస్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రణ్‌బీర్ కపూర్‌ను పరిచయం చేసి... రణ్‌వీర్ సింగ్‌ను స్టార్ హీరోను చేసిన భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ ఆయన ఇంటికే వెళ్లి కలిశారు. వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయితే మాత్రం టాలీవుడ్‌లో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కు #BB అయినట్లు... బాలీవుడ్‌లో బన్నీ, భన్సాలీ కాంబో #BB అయ్యే అవకాశం ఉంది.
సంజయ్ లీలా భన్సాలీ భారీ చిత్రాలకు పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్‌తో ‘హమ్ దిల్‌కే చుకే సనమ్’, షారుక్ ఖాన్‌తో ‘దేవదాస్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను ఆయన తన మొదటి మూడు సినిమాల్లోనే ఇచ్చాడు. రెండో సినిమా హమ్ దిల్‌కే చుకే సనమ్‌తో ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పరిచయం చేసింది కూడా సంజయ్ లీలా భన్సాలీనే. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాలతో రణ్‌వీర్ సింగ్‌ను స్టార్ చేశాడు. బాజీరావు మస్తానీ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, పద్మావత్ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఇటీవలే ఆలియా భట్‌ను టైటిల్ రోల్‌లో పెట్టి ‘గంగుబాయ్ కతియావాడీ’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టారు.
ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయితే ఈ కాంబినేషన్ రచ్చ మామూలుగా ఉండదు. సంజయ్ లీలా భన్సాలీతో తెలుగు హీరోల పేర్లు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. జూనియర్ ఎన్టీఆర్‌తో సంజయ్ లీలా భన్సాలీ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే వార్తల స్థాయిని దాటి బన్నీ చర్చల వరకు కూడా వెళ్లాడు. కాబట్టి సంజయ్ ఏ తెలుగు హీరోతో మొదటి సారి పనిచేస్తాడనే దానిపై ఎంతో ఆసక్తి నెలకొంది.