Happy Birthday Rana : రానా రూటే సపరేటు - నయా ఇండియన్ సినిమాలో యాక్టింగ్ మెర్క్యురీ
Rana Daggubati Birthday : నటుడిగా రానా దగ్గుబాటి రూటే సపరేటు. నలుగురు నడిచే దారిలో ఆయన వెళుతున్నట్టు ఉంటుంది. కానీ, నిశితంగా చూస్తే చాలా వైవిధ్యం కనబడుతుంది.
రానా దగ్గుబాటి (Rana Daggubati)... కథానాయకుడిగా, నటుడిగా ఆయన రూటే సపరేటు. రానా... నయా ఇండియన్ సినిమాలో యాక్టింగ్ మెర్క్యురీ. ఈ మాట దగ్గుబాటి వారసుడికి సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే... క్యారెక్టర్ ఏదైనా సరే, రానా చేయగలడనే పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఈ ఇమేజ్ ఒక్క రోజులో వచ్చింది కాదు... దీని వెనుక కథానాయకుడిగా తెలుగు తెరపై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి చేసిన కృషి ఉంది.
'లీడర్' సినిమాతో తెలుగు తెరపై రానా దగ్గుబాటి ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా ముందు? రానా జన్మించింది సినిమా ప్రపంచంలో! షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్ట్ డిస్కషన్స్, స్టోరీ రైటింగ్ & సిట్టింగ్స్... ఇవేవీ రానాకు కొత్త కాదు. సినిమా వాతావరణంలో పెరిగారు. ఆయన నరం నేరంలో చలన చిత్రం ఉంది. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడి మనవడే ఈ రానా. ఈతరం నిర్మాత సురేష్ బాబు తనయుడు. వెంకటేష్‌కు అన్నయ్య కుమారుడు. హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోకి పునాది పడినప్పటి నుంచి ఆయనకు తెలుసు. నిర్మాత, స్టూడియో అధినేత, నటుడు... విభిన్న కోణాల్లో సినిమా పరిశ్రమను చూశారు. బహుశా... అందువల్లనే ఏమో!? నటుడిగా ఆయన ఎంపిక చేసుకునే పాత్రల్లో వైవిధ్యం కనబడుతుంది.
సురేష్ ప్రొడక్షన్స్ కమర్షియల్ సినిమాలు మాత్రమే తీయలేదు. కొన్ని విభిన్న సినిమాలు కూడా నిర్మించింది. వెంకటేష్ హీరోయిజమ్ బేస్డ్ మూవీస్ మాత్రమే చేయలేదు. హీరోయిన్లకు ప్రాముఖ్యం ఉన్న కథలూ చేశారు. రానా ఫిల్మోగ్రఫీలో ఆ ప్రభావం కనబడుతుంది.
ఇప్పుడు పాన్ ఇండియా ఫీవర్ నడుస్తోంది. ప్రజెంట్ స్టార్ హీరోలు అందరూ హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రానాకు ఆ అవసరం లేదు. ప్రభాస్ 'బాహుబలి' తర్వాత బాలీవుడ్‌లో స్టార్ అయ్యారు. రానా అప్పటికే హిందీలో స్టార్! ఉత్తరాది ప్రేక్షకులకు ఆయన తెలుసు. హీరోగా తెలుగు తెరకు 'లీడర్' సినిమాతో పరిచయమైన రానా... ఆ తర్వాత ఏడాది 'దమ్ మరో దమ్' సినిమాతో హిందీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులతో టచ్‌లో ఉన్నారు.
Also Read : హ్యాపీ బర్త్ డే వెంకటేష్... వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'
హీరోగా మాత్రమే కంటిన్యూ కావాలని రానా ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథల్లో చిన్న భాగం కావడానికి ఆసక్తి చూపించారు. హిందీ సినిమాలు 'బేబీ', 'ఏ జవానీ హై దివానీ', తమిళంలో అజిత్ 'ఆరంభం', తెలుగులో అనుష్క 'సైజ్ జీరో'లో అతిథి పాత్రలు చేశారు. కేవలం తన పాత్రకు ప్రాముఖ్యం ఉండే కథలే చేయలేదు. రాణీ రుద్రమదేవి కథతో రూపొందిన 'రుద్రమదేవి' సినిమాలో నటించారు. 'విరాటపర్వం' చిత్రంలో సాయి పల్లవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా చేశారు. నటుడిగా ఈతరం హీరోల్లో రానా చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదని చెబితే అతిశయోక్తి కాదేమో!? 'బాహుబలి'లో భల్లాలదేవ చక్రవర్తిగా, 'కృష్ణం వందే జగద్గురుమ్'లో బీటెక్ బాబుగా, 'ఘాజి'లో అర్జున్ వర్మగా, ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబు నాయుడుగా, 'అరణ్య'లో నాగేంద్ర భూపతిగా, 'భీమ్లా నాయక్'లో డేనియల్ శేఖర్‌గా... విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. హీరోనా? విలనా? క్యారెక్టర్ ఆర్టిస్టా? గెస్టా? వంటివి చూడలేదు. నచ్చిన పాత్రలు చేశారు. వాటిని ప్రేక్షకులు మెచ్చారు. క్యారెక్టర్ల కోసం బరువు పెరిగారు, తగ్గారు. పాదరసం (మెర్క్యురీ) లా పాత్రలో ఒదిగిపోయారు. అదీ రానా స్పెషాలిటీ! అందుకే, ఆయన అంటే ప్రేక్షకులకు ప్రేమ!
సినిమా ఇండస్ట్రీలోనూ రానా మెర్క్యురీ లాంటి మనిషి అని చెప్పాలి. ఆయన హీరో మాత్రమే కాదు... నిర్మాత కూడా! మంచి కథలతో రూపొందిన చిన్న సినిమాలకు అండగా నిలబడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ రన్ చేశారు. టాక్ షో హోస్ట్ చేశారు. అవార్డు షోల్లో యాంకరింగ్ చేశారు. రానా... కథానాయకుడు, నటుడు, నిర్మాత, హోస్ట్ & మోర్! నయా ఇండియన్ సినిమాలో మెర్క్యురీ మెటీరియల్.