Comedian Sudhakar: చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య నేనే! ఆయనతో ఎలాంటి గొడవలు లేవు: కమెడియన్ సుధాకర్!
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సుధాకర్, తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కీలక విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ తో తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో చక్కటి హాస్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హాస్య నటుడు సుధాకర్. కామెడీ టైమింగ్ తో పాటు అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకుల పెదాలపై నవ్వుల పువ్వులు పూయించేవారు. వందల సినిమాల్లో టాహీరోలతో కలిసి పని చేశారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. ఫాదర్స్ డే సందర్భంగా తన కొడుకు బిన్నీతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆ పుకార్లు బాధించాయి!
దిగ్గజన హాస్య నటుడు సుధాకర్ చనిపోయారంటూ కొద్ది కాలం క్రితం వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆయన లేరనే వార్తలు రావడం పట్ల సుధాకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాను బతికే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఈ పుకార్లపై ఆయన స్పందించారు. “కొద్ది రోజుల క్రితం నేను చనిపోయానంటూ కొంతమంది పుకార్లు పుట్టించారు. ఆ పుకార్లు నన్ను బాధపెట్టాయి. నేను చాలా బాగున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించకండి. పుకార్ల కారణంగా చాలా మంది బాధపడే అవకాశం ఉంటుంది. పుకార్లు పుట్టించే వారికి మంచిది కాదు. ఎదుటివారికి మంచిది కాదు” అన్నారు.
నచ్చిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ
తెలుగు సినిమా పరిశ్రమలో తనకు నచ్చిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని చెప్పారు సుధాకర్. బ్రహ్మీ అంటే కూడా ఇష్టం అన్నారు. “టాలీవుడ్ లో నాకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. ఆయన కామెడీ బాగుంటుంది. బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లోనే ఉంటేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో, ఎన్నో చక్కటి పాత్రలు చేశాను. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పని చేశాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సంతోషంగా చేసే వాడిని” అని చెప్పుకొచ్చారు.
చిరంజీవి తర్వాత పవన్ కు నేను అన్నయ్య
చిరంజీవి ఇప్పటికీ తనను చాలా ఇష్టపడతారని సుధాకర్ చెప్పారు. ఏ అవసరం వచ్చినా కాల్ చేస్తే స్పందిస్తారని వెల్లడించారు. “సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి, నేను ఒకే రూములో ఉండేవాళ్లం. అప్పటి నుంచి మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ‘యముడికి మొగుడు’ సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టారు. ఆయన కోరిక మేరకు నేను ఆ సినిమాలో నటించాను. ఈ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. తమిళ సినిమాల కంటే తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందుకే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. నా కొడుకు బిన్నీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ఆశీర్వాదాలను వాడికి ఉన్నాయి.” అని సుధాకర్ చెప్పారు.
1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. అక్కడ దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడింది. ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి ‘కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్’ సినిమా తీశారు. రాధిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడంతో హైదరాబాద్ కు వచ్చారు. ‘స్టేట్ రౌడీ’, ‘కొదమ సింహం’, ‘రాజా విక్రమార్క’, ‘పవిత్ర ప్రేమ’, ‘పవిత్ర బంధం’, ‘బొంబాయి ప్రియుడు’, ‘పెళ్లి పందిరి’, ‘సుస్వాగతం’, ‘పెళ్లి చేసుకుందాం’ సహా పలు సినిమాలతో అకట్టుకున్నారు.
Read Also: మేం తీసింది రామాయణం కాదు: ‘ఆదిపురుష్’ రచయిత మనోజ్