Little Hearts Director: ఎన్టీఆర్‌తో సినిమా తీసిన తాతయ్య... 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనవడు... 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి బ్యాగ్రౌండ్ తెల్సా?
Sai Marthand Background: 'లిటిల్ హార్ట్స్' విడుదల తర్వాత దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ప్రేక్షకులు ఉన్నారు. దర్శకుడు ఎవరని ఆరా తీసినోళ్లు ఉన్నారు. ఆ సాయి మార్తాండ్ ఎవరో తెలుసా?

'లిటిల్ హార్ట్స్' విడుదలకు ముందు చిన్న సినిమాగా చూశారంతా! బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వసూళ్లు సాధించింది. 'లిటిల్ హార్ట్స్' సినిమాలో వినోదం ప్రేక్షకులకు నచ్చింది. నటీనటులతో పాటు దర్శకుడిపై చాలా ప్రశంసలు వచ్చాయి. దర్శకుడు ఎవరు? ఎవరీ సాయి మార్తాండ్? అని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఆరా తీశారు. చిత్రసీమ నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్.
ఎవరీ సాయి మార్తాండ్? ఎన్టీఆర్ కనెక్షన్ ఏమిటి?
Who Is Sai Marthand? ఎవరీ సాయి మార్తాండ్? అంటే... బీవీ ప్రసాద్ మనవడు. ఆయన ఎవరు? అంటే... దిగ్గజ తెలుగు దర్శకుడు. అవును... ఎన్టీఆర్ - ఏయన్నార్ జమానాలో దర్శకుడిగా సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయన మనవడు మళ్ళీ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (Senior NTR) కథానాయకుడిగా నటించిన 'మేలు కొలుపు', 'ఆరాధన' సినిమాలు గుర్తు ఉన్నాయా? పోనీ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'చుట్టాలున్నారు జాగ్రత్త'? ఆ సినిమాలకు బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. అంతే కాదు... మెగాస్టార్ చిరంజీవి నటించిన 'తాతయ్య ప్రేమ లీలలు' కూడా తీశారు. సుమారు 20 సినిమాల వరకు బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. భానుమతి ప్రధాన పాత్రలో ఆయన తీసిన 'మట్టిలో మాణిక్యం' సినిమాకు తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డు అందుకుంది.
నటుడు కాబోయి దర్శకుడిగా మారిన సాయి!
'లిటిల్ హార్ట్స్' విజయం తర్వాత 'మీ తాతయ్య బీవీ ప్రసాద్ పేరు నిలబెట్టావ్' అని సాయి మార్తాండ్ మీద కొందరు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే... తాతయ్య బాటలో నడుస్తూ దర్శకుడు కావాలని సాయి మార్తాండ్ అనుకోలేదు. తొలుత హీరో అవ్వాలని ట్రై చేశాడు.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?
నటుడు కావాలని అనుకున్న సాయి మార్తాండ్... తనలాంటి కొత్త యాక్టర్ కోసం ఎవరూ కథలు రాయారని గ్రహించాడు. తన కోసం కథలు రాసుకోవడం మొదలు పెట్టాడు. వాటిని పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అయితే ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. మొదట రెండు మూడు కథలు రాసుకున్నా తర్వాత తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను రంగరించి 'లిటిల్ హార్ట్స్' రాశారు. అది మౌళికి చెప్పడం, '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ దగ్గరకు తీసుకు వెళ్లడం, ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లడం జరిగాయి. విడుదల తర్వాత ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు.
బీవీ ప్రసాద్ 1990లలో మరణించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి రెండో తరం ఇండస్ట్రీలోకి రాలేదు. మళ్ళీ 35 ఏళ్ళకు మనవడు వచ్చి విజయం సాధించాడు. తాతకు తగ్గ మనవడు, తాతయ్య పేరు నిలబెట్టిన మనవడు అని పేరు తెచ్చుకున్నాడు.
Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?






















