Sankranthi 2026 Movies List: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?
Sankranthi 2026 Movies List Telugu: సంక్రాంతి 2026 బాక్సాఫీస్ ఫైట్ మూమూలుగా ఉండేలా లేరు. ఒకట్రెండు కాదు... బరిలో ఐదు సినిమాలు ఉన్నాయ్. అందులో స్టార్ హీరోలు ఉన్నారు. ఆ లిస్ట్ చూడండి.

విజయదశమికి ఇంకా ఎన్ని రోజులో లేదు. అయితే... దసరా బరిలో వచ్చే సినిమాల కంటే సంక్రాంతి 2026కి వచ్చే సినిమాలపై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఒకట్రెండు సినిమాలు పండక్కి వస్తాయని అనుకుంటే... ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు రెడీ అయ్యాయి. మరి, వాటిలో చివరకు వరకు బరిలో నిలిచేది ఎవరు? వెనక్కి వెళ్ళేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? ఓ లుక్ వేయండి.
చిరంజీవి గారు... పండక్కి వస్తున్నారు!
సంక్రాంతి బరిలో ముందుగా కర్చీఫ్ వేసిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. పండగకి వస్తున్నారు... అనేది ఉపశీర్షిక. సంక్రాంతి సీజన్ నుంచి ఈ సినిమా వెనక్కి వెళ్ళదు. సంక్రాంతికి విడుదల చేయడమే టార్గెట్‌గా దర్శక నిర్మాతలు సినిమా రెడీ చేస్తున్నారు. విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు గానీ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేయనున్నట్టు సమాచారం.
సంక్రాంతి రేసులోకి వచ్చిన రాజా సాబ్!
సంక్రాంతి రేసులోకి తాజాగా వచ్చిన సినిమా 'ది రాజా సాబ్'. రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్ 5న థియేటర్లలోకి రావడానికి ముందు రెడీ అయ్యారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా మిగతా పనులకు సమయం అవసరం కావడం... అది పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సంక్రాంతికి విడుదల చేయమని రిక్వెస్టులు రావడం వల్ల పండగ బరిలోకి సినిమా వచ్చింది. పండక్కి సినిమా రావడం గ్యారంటీ. జనవరి 9న సినిమా విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు కనుక ఈ రిలీజ్ మీద మరో సందేహం అవసరం లేదు.
'జన నాయగన్'గా తమిళ్ నుంచి విజయ్!
సంక్రాంతి పండక్కి తమిళ్ సినిమాలు విడుదల కావడం ఆనవాయితీ. పాన్ ఇండియా మార్కెట్ పెరగడంతో తెలుగులోనూ ఆయా సినిమాలను డబ్బింగ్ చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న 'జన నాయగన్' విడుదల కానుంది. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని ప్రచారం జరిగినా... ఆ పాయింట్ తీసుకుని కొత్త సన్నివేశాలతో సినిమా తీస్తున్నట్టు టాక్. సంక్రాంతికి ఈ సినిమా రావడం కూడా గ్యారెంటీ. తెలుగులోనూ సేమ్ డే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జనవరి 9న 'ది రాజా సాబ్'తో విడుదల కానుంది.
సంక్రాంతికి సినిమా రెడీ చేస్తున్న రవితేజ!
సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమైన మరో సినిమా మాస్ మహారాజా రవితేజది. 'నేను శైలజ', 'చిత్రలహరి' వంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయనొక సినిమా చేస్తున్నారు. రవితేజ 76వ చిత్రమది. సంక్రాంతికి విడుదల చేస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పుడు తెలిపారు. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు.
'అనగనగా ఒక రాజు'తో నవీన్ పోలిశెట్టి కూడా!
సంక్రాంతి విడుదలకు సిద్ధమైన మరో సినిమా 'అనగనగా ఒక రాజు'. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన చిత్రమిది. జనవరి 14న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. అందువల్ల పండక్కి వచ్చే అవకాశం ఎక్కువ.
Also Read: 'ఘాటీ' సెన్సార్ రివ్యూ... అనుష్క సినిమా టాకేంటి? దర్శకుడు క్రిష్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
సంక్రాంతికి విడుదలకు సిద్ధమైన ఐదు సినిమాల్లో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఒక్కటే అసలు సిసలైన పాన్ ఇండియా సినిమా. ఆయనకు హిందీలోనూ మార్కెట్ ఉంది. సో, ఆ సినిమా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. 'జన నాయగన్'కు తమిళ్ క్రేజ్ ఎక్కువ. డిస్ట్రిబ్యూటర్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ కౌంట్ డిసైడ్ అవుతుంది. చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సైతం వెనక్కి వెళ్ళడం అసాధ్యం. పండక్కి మూడు సినిమాలు విడుదలైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందు వచ్చే సినిమాలకు ఓపెనింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా సినిమాల పరిస్థితి చూడాలి.
Also Read: సెప్టెంబర్ 25 నుంచి 'అఖండ 2' వాయిదా... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన టీమ్... 'ఓజీ'కి లైన్ క్లియర్





















