Hari Hara Veeramallu: వీరమల్లుకి విముక్తి ఎప్పుడు? క్రిష్‌కి ఎదురు చూపులు తప్పవా?
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఇది 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల కాలానికి సంబంధించిన చారిత్రక కథాంశంతో రూపొందే ఒక బందిపోటు వీరోచిత గాథ అని సమాచారం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంతవరకూ అంతా బాగానే వుంది కానీ, ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
'హరి హర వీరమల్లు' పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా 2020 సెప్టెంబర్ లో ప్రొడక్షన్ ప్రారంభమైంది. అయితే వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. షూటింగ్ సజావుగా సాగకపోవడానికి కరోనా పాండమిక్ ఒక కారణమైతే, పవన్ సినిమాల ప్రాధాన్యతా క్రమం మారుతూ రావడం కూడా ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఆలస్యానికి మరో కారణం.
ఏదైతేనేం 2021లో విడుదల చేస్తామని ప్రకటించిన సినిమాని ముందుగా 2022 సమ్మర్ కి షిప్ట్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతి అన్నారు. చివరిగా ఈ ఏడాది వేసవిలో తీసుకొస్తామని పేర్కొన్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వీరమల్లుకి విముక్తి లభించేలా లేదనే కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి దాదాపు సగం షూటింగ్ పెండింగ్ వుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి, మరో మూడు చిత్రాలని అనౌన్స్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్.. సుజీత్ డైరెక్షన్ లో 'OG' చిత్రాలను ప్రారంభించారు. అయితే క్రిష్ సినిమా తర్వాతే ఈ రెండూ ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు కొత్తగా PKSDT ప్రాజెక్ట్ ముందు వరుసలోకి వచ్చింది.
సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా బుధవారం ఓ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇది ‘వినోదయ సితమ్’ అనే తమిళ్ చిత్రానికి రీమేక్. కేవలం 20 రోజుల కాల్షీట్స్ ఇస్తే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుందట. అందుకే మిగతా ప్రాజెక్ట్స్ ని పక్కనపెట్టి, ఈ రీమేక్ మీదకు వెళ్లారని తెలుస్తోంది. అయితే దీని తర్వాత ఎప్పటి నుంచో వేచి చూస్తున్న హరీష్ శంకర్ చిత్రాన్ని మొదలు పెడతారని టాక్. ఇదే జరిగితే వీరమల్లు మరింత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది.
అందులోనూ 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెడితే, నాలుగు చిత్రాల్లో ఏది కంప్లీట్ అవుతుందనేది చెప్పడం కష్టమే అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, 'హరి హర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, ఆదిత్య మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్