Virupaksha : నాకు మాట రాకున్నా అర్థం చేసుకున్నారు, నా డ్రైవర్ ఏడ్చేశాడు - సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' మంచి విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ సందర్బంగా ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు హీరో సాయి స్పష్టం చేశారు..
Virupaksha : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' ఏప్రిల్ 21న తెలుగులో రిలీజై భారీ విజయాన్ని మూటగట్టుకుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాను తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ మే5, మే12న రిలీజ్ చేయనున్నట్టు హీరో సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. పలు లాంగ్వేజెస్ లో ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ మూవీ టీం.. ఇటీవల విరూపాక్ష థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్.. తనతో నటించిన నటులతో పాటు, మూవీ కోసం కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సినిమా కేవలం నటీనటులనే కాదు.. మూవీలో ఇన్వాల్వ్ అయిన కెమెరా అసిస్టెంట్, టెక్నిషియన్స్ అందర్నీ మెచ్చుకుంటున్నారని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారన్న ఆయన.. వారందరికీ ఫలితం దక్కిందని తెలిపారు. అందరికంటే ఎక్కువగా మేకప్ డిపార్ట్ మెంట్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారంటే.. చాలా గొప్ప విషయమని చెప్పారు. వారందరికీ సాయి కృతజ్ఞతలు తెలియజేశారు. వీళ్లు కాకుండా ఆడియెన్స్ కూడా థ్యాంక్స్ అని తెలిపారు.
ఆడియెన్స్ దగ్గర సక్సెస్ ఉంది కాబట్టే తమకు అదే సక్సెస్ ను ఇచ్చారని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ప్రతీ వారం, ప్రతీ సినిమా నంబర్స్ మారుతూ ఉంటాయన్న ఆయన.. ప్రతీ సినిమా విజయం సాధించాలని ఆశించారు. మంచి సినిమాలు చేస్తామని ప్రామిస్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం తాను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సందర్భాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘‘యాక్సిడెంట్ ట్రీట్మంట్ పూర్తయిన తర్వాత.. నా డ్రైవర్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లినపుడు ఏడ్చేశాడు. ఆయన ఇప్పుడు నన్ను చూసి చాలా గర్వంగా ఫీలవుతాడన్నారు. నాతో నటించిన తోటి నటులు.. నాకు మాటరాకున్నా, నా డైలాగ్‌ను అర్థం చేసుకుంటూ ఎంతో సహకరించారు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కాసేపు భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఈ థ్యాంక్స్ అనే మాట చెప్పడం వెనుక ఓ తెలియని ఆనందం ఉంది. ఈ రోజు ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు వీరందరి సహకారం ఉంది’’ అని స్పష్టం చేశారు.
మే 5 నుంచి ఈ మూవీ తమిళం, హిందీ, మళయాలంలో రిలీజ్ కానుందని, మే 12న కన్నడలో విడుదల చేస్తున్నామని సాయి స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల్లోనూ ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన 'విరూపాక్ష' సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల కలెక్ట్ చేసింది. అంతేకాకుండా వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ సినిమాగా రికార్డు సృష్టించింది. విరూపాక్ష సినిమా విడుదలైన ఎనిమిది రోజులకే.. రూ.1.130 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుని.. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది.