Veerabhimani Preview - వీరాభిమాని ప్రివ్యూ: చిరంజీవి కోసం యమలోకానికి వెళ్ళిన అభిమాని కథ... సురేష్ కొండేటి సినిమాలో ఏముందంటే?
Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఏపీ తెలంగాణలో 70 థియేటర్లలో వీరాభిమాని సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది? అనేది చూస్తే...

ఆగస్టు 22న థియేటర్లలోకి వస్తున్న సినిమాలలో 'వీరాభిమాని' (Veerabhimani Movie) ఒకటి. దీని నిడివి 40 నిమిషాలు మాత్రమే. ఏపీ, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 70 థియేటర్లలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday Special) సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రమిది. సురేష్ కొండేటి ప్రధాన పాత్ర పోషించారు. అసలు ఈ సినిమాలో ఏముంది? కథ ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
వీరాభిమాని సినిమా ప్రివ్యూ...
చిరు కోసం అభిమాని ప్రాణత్యాగం!
అనగనగా ఒక అభిమాని (సురేష్ కొండేటి). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే ప్రాణం. డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పవచ్చు. మనిషి అన్నాక ఏదో ఒక సమయంలో మరణించడం సహజం. అయితే తన అభిమాన కథానాయకుడికి మరణం అనేది ఉండకూడదని సురేష్ కొండేటి కోరుకుంటాడు. అందుకోసం ఓ పథకం వేస్తాడు.
చిరంజీవి కోసం అభిమాని సురేష్ కొండేటి ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రాణాలు పోయిన తర్వాత యమలోకానికి వెళతాడు. అక్కడ చిత్రగుప్తుడిని బురిడీ కొట్టించి మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసే పుస్తకాన్ని తెరుస్తాడు. అందులో చిరంజీవికి చెందిన పేజీ చింపేసి తినేస్తాడు.
పది కాలాల పాటు జీవించడం అంటే ప్రాణాలతో ఉండటం కాదని, మంచి పనులు చేసి పేరు తెచ్చుకుని పది కాలాల పాటు ప్రజల గుండెల్లో జీవించడం అని, ఆల్రెడీ చిరంజీవి చేసిన మంచి పనుల వల్ల ఆయన్ను ప్రజలు ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటారని యమ ధర్మరాజు (అజయ్ ఘోష్) చెబుతాడు. అది 'వీరాభిమాని' కథ.
Also Read: మెగా 157 టైటిల్ గ్లింప్స్‌కు విక్టరీ టచ్... చిరు కొత్త సినిమా టైటిల్, ఆ వీడియోలో స్పెషాలిటీ తెలుసా?

సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన 'వీరాభిమాని' సినిమాకు 'ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్' (ఓ అభిమాని కోరిక) అనేది ఉపశీర్షిక. భూలోకం, యమలోకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాంబాబు దోమకొండ దర్శకుడు. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు నిర్మించారు. మొదట ఈ సినిమాకు 'అభిమాని' అని టైటిల్ పెట్టారు. తర్వాత 'వీరాభిమాని'గా మార్చారు. సుమారు ఏడెనిమిది నెలల క్రితం సినిమా రెడీ అయ్యింది. అయితే చిరు పుట్టినరోజు ప్రత్యేకంగా ఇప్పుడు విడుదల చేస్తున్నారు.





















