ఎన్టీఆర్‌తో షూటింగ్ అంటే తెల్లవారుజాము 2.30 గంటలకే లేచి రెడీ అయ్యేవాళ్లం: కాంచన
అలనాటి సీనియర్ నటి కాంచన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు గారి గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అలనాటి నటి కాంచన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 60, 70వ దశకంలో కాంచన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసిన ఆమె సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీ దిశగా అడుగులు వేసి.. హీరోయిన్‌గా సక్సెస్ అయ్యారు. సుమారు 200కు పైగా సినిమాలు చేసిన ఆమె అప్పటి అగ్ర హీరోలతో కలసి పలు సినిమాల్లో నటించారు. విభిన్న తరహా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాలో బామ్మగా నటించి మెప్పించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాంచన గారు ఎన్టీ రామారావు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీ రామారావు గారు అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకున్నారు.
"ఎన్టీఆర్‌తో సినిమా చేసేటప్పుడు కొంచెం టైమింగ్స్ చూసుకోమని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చెప్పేవారు. ఇక ఆయన షూటింగ్ కి వచ్చారంటే సెట్ లో ఉన్న వాళ్లంతా కచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి. ఎంతలా అంటే మన తల్లిదండ్రులు కూడా అంతటి శిక్షణ ఇవ్వరేమో.. అంతలా ఆయన క్రమశిక్షణ నేర్పిస్తారు. తెల్లవారుజామున 2:30గం. లకే లేచి స్నానం చేయాలి. ఇక ఆ తర్వాత అన్ని పనులు పూర్తి చేసుకొని సరిగ్గా మేకప్ స్టూడియోలోకి వెళ్లకముందు 6:30 గం. వరకు సెట్లో అందరు హాజరయ్యారా? మిగతా కళాకారులంతా వస్తున్నారా? అంటూ అడిగేవారు. ఇక నన్ను చూసి 'ఏం కాంచన గారు. ఏం చేశారు టిఫిన్? అని అడిగితే 7 గంటలకే ఏం టిఫిన్ చేస్తామని, నాలో నేను అనుకొని ఆయనకు మాత్రం చేసాను అనేదాన్ని’’ అని తెలిపారు.
‘‘షూటింగ్లో ఆయన ముందు కాస్త సైలెంట్ గా కూర్చునే దాన్ని. అది చూసి రామారావు ఆర్టిస్టులు, కళాకారులు, టెక్నీషియల్ అందరూ ఇల్లు, కొంప అంతా వదిలేసి ఎవరి కూటి కోసం వాళ్లు ఇక్కడ పనిచేస్తారు. వాళ్లందరూ వచ్చినప్పుడు.. అదే మన కుటుంబం అనుకొని మనం ప్రవర్తించాలి. కాబట్టి మీరు ఇలా మూడీగా కూర్చుంటే కుదరదు. సెట్లో ఉన్న వాళ్ళందరితో కలిసిపోవాలి. అందరితో చక్కగా మాట్లాడాలి. అప్పుడే నీకు రేపు షూటింగ్లో షాట్ షాట్ కి మధ్యన పదిసార్లు సీన్ ఎక్స్ ప్లేన్ చేయాల్సిన అవసరం రాదు. ఆటోమేటిక్ గా నువ్వే చెప్పేస్తావ్ అంటూ ఆ డిసిప్లేన్ ని రామారావు గారు అందరికీ నేర్పించారు’’ అని తెలిపారు.
‘‘రామారావు గారితో పాటు నాగేశ్వరావు గారు కూడా అంతే డిసిప్లేన్ ని నేర్పిస్తారు. అయితే క్రమశిక్షణ విషయంలో నాగేశ్వరావు గారు కొంచెం రిలాక్స్ అవుతారు పోనీలే అని. కానీ రామారావు గారు మాత్రం అలా కాదు. ఆయనకు క్రమశిక్షణ లేకపోతే నచ్చదు. అప్పుడు ఆయన 'ఏం' అని చెప్తే చాలు సెట్ లో ఉన్న వాళ్లంతా భయపడిపోయేవారు. ఆయన ఫినిష్, ప్యాకప్ అని చెప్పేంతవరకు ఆర్టిస్టులు అందరూ ఏ గెటప్ లో ఉండేవాళ్ళో అదే గేటప్ ని మెయింటైన్ చేసేవారు. అంత క్రమశిక్షణని ఆయన సెట్ లో వాళ్లందరికీ అలవరిచేవారు. క్రమశిక్షణ విషయంలో ఆయన పట్టు వదలని మనిషి. అందుకే ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణకు మారుపేరు" అంటూ చెప్పుకొచ్చారు సీనియర్ నటి కాంచన.