Revathy: క్యాస్టింగ్ కౌచ్ సమస్యలకు మొబైల్ ఫోన్లే కారణం, ఆ పరిస్థితి వస్తే నవ్వి వదిలేసేదాన్ని - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో నటి రేవతి కామెంట్స్
ఒకప్పుడు సినీ పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఎలా స్పందించేవారు అనే విషయాలను సీనియర్ నటి రేవతి బయటపెట్టారు.
దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అభివృద్ధి గుర్తించి... దక్షిణ భారతదేశంలోని దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకు శతాబ్దానికి పైగా ఘన చరిత ఉన్న ABP నెట్ వర్క్ ఇవాళ చెన్నైలో ABP Southern Rising Summit 2023 నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి రేవతి.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి బయటపెట్టారు.
మొబైల్ ఫోన్ల వల్లే సమస్యలు..
‘‘మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు మీరు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చూసుంటారు. కానీ అప్పట్లో ఖండించడానికి పెద్దగా అవకాశాలు లేవు, అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకొని అలా చేసుంటే బాగుండేది అనుకున్న రోజులు ఉన్నాయా?’’ అనే ప్రశ్నకు రేవతి సమాధానం ఇస్తూ... ‘‘80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవు. మొబైల్ ఫోన్లు, మెసేజింగ్‌తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతాను. ఎవరైనా కళ్లలోకి చూసి నాకు నువ్వు కావాలి, నాతో ఉండు అని తప్పుడు ఉద్దేశ్యంతో అడగడం అంత సులభం కాదు. కానీ ఈరోజుల్లో ఒక్క మెసేజ్ పెడితే చాలు. వచ్చి కలువు, కాఫీ తాగుదామా అని ఒక్క మెసేజ్‌తో చెప్పడం చాలా ఈజీ అయిపోయింది’’ అంటూ ఈరోజుల్లో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు మొబైల్ ఫోన్ల వల్లే వస్తున్నాయి అని రేవతి.. తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.
ఎమోజీలు ఉపయోగించే ముందు ఆలోచించాలి..
మొబైల్ ఫోన్ల వల్ల ఎమోజీల వాడకం కూడా ఎక్కువయ్యిందని, అది అతిపెద్ద సమస్యగా మారిందని రేవతి చెప్పుకొచ్చారు. ఎమోజీలను సరిగా అర్థం చేసుకొని ఉపయోగించాలి అని లేకపోతే అది అవతలి వ్యక్తికి తప్పుగా అర్థమయ్యి అనేక సమస్యలకు దారితీస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్‌గా మాట్లాడుకుంటున్న సమయంలో ఎమోజీలు ఉపయోగించడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. పైగా ఈతరంలో పిల్లలు చాలా కష్టాలను ఎదుర్కుంటున్నారని, వారిపై చాలా ఒత్తిడి ఉందని వాపోయారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో స్త్రీ, పురుషుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఒకప్పుడు ఎలా ఉంది అని పోల్చి చూశారు.
అమ్మ నాతో క్లోజ్‌గా ఉండేవారు..
‘‘ఒకప్పుడు స్త్రీ, పురుషులు అనేవారు ఒక దగ్గర ఉంటే సరదాగా మాట్లాడడం అనేది ఉండేది. కానీ అది దాటి వెళ్తే అంగీకారం అనేది కావాలి. ఒకప్పుడు అంగీకారం అనే మాట ఇండస్ట్రీలో ఉండేది కాదు. ఏదైనా చెడు అనుభవం ఎదురైతే నవ్వి నో అని చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్లోజ్‌గా ఉండేవాళ్లతో షేర్ చేసుకునేవాళ్లం. కానీ ఇండస్ట్రీలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా తెలియదు. మంచి విషయం ఏంటంటే మా అమ్మ నాతో క్లోజ్‌గా ఉండేవారు. ఆ రోజుల్లోనే నాకు చాలా విషయాలు నేర్పించారు. నేను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడే వాతావరణంలో పెరిగాను. కానీ ఆరోజుల్లో చాలామంది ఓపెన్‌గా మాట్లాడేంత స్వేచ్ఛ లేదు. ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తిస్తే.. ఆయనకు కొంచెం బుద్ధి ఇస్తే బాగుంటుంది అనుకునేదాన్ని. కానీ పైకి మాత్రం నవ్వి వదిలేసేదాన్ని. ఇప్పటి రేవతి అయితే సారీ నాకు మీ మీద ఇంట్రెస్ట్ లేదు అని ముక్కుసూటిగా చెప్పేస్తాను’’ అని రేవతి ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి స్పష్టంగా వివరించారు.
Also Read: చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌనమేల - రాజీవ్ కనకాల ఏం చెప్పారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial