Ram Charan Hollywood Debut : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?
రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలోనూ ఆ ప్రస్తావన వచ్చింది. పూర్తిగా చెప్పలేదు గానీ... చరణ్ కొన్ని లీకులు ఇచ్చారు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఆయన నటనకు వెస్ట్రన్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు వెళ్లిన ఆయన్ను, ఆ స్టైల్ చూసి హాలీవుడ్ హీరోలా ఉన్నాడని అక్కడి మీడియా పేర్కొంది. బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా అని ఓ సంస్థ కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరుగుతోంది.
గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ వేదికగా హాలీవుడ్ దర్శక, నిర్మాతలతో కలిసి పని చేయాలని ఉందని రామ్ చరణ్ పేర్కొన్నారు. తన మనసులో కోరికను బయట పెట్టారు. ఆ మధ్య 'స్టార్ వార్స్' దర్శకుడు జేజే అబ్రహంను కలిశారు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆస్కార్ వేడుకల్లో చరణ్ తెలిపారు. ''హాలీవుడ్ సినిమాలో రోల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అది జేజే అబ్రహంతో కాదు'' అని చెప్పారు.
టామ్ క్రూజ్ సినిమాలో రామ్ చరణ్?
లేటెస్ట్ టాక్ ఏంటంటే... హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ 'టాప్ గన్ 3'లో రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయట. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో శుక్రవారం రామ్ చరణ్ పాల్గొన్నారు. అక్కడ హాలీవుడ్ డెబ్యూ గురించి ప్రస్తావన వచ్చింది. 'హాలీవుడ్ సినిమా చేస్తున్న మాట నిజమేనా? హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందని చదివా' అని అడిగితే... ''ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. చర్చలు జరుగుతున్నాయి. మీరంతా ఆశీర్వదించండి. జరిగేలా చూస్తా'' అని రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు.
హాలీవుడ్ సినిమాకు సంతకం చేశారా? లేదా చేసే ప్రాసెస్‌లో ఉన్నారా? అని అడిగితే... ''ప్రాసెస్ జరుగుతోంది. జరిగే వరకు ప్రతిదీ ప్రాసెస్‌లో ఉంటుంది. హాలీవుడ్ సినిమా చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
''మీ సౌత్ జనాలతో ఇదే సమస్య, అంచనాలు తగ్గిస్తూ ఒకేసారి భూమ్ అంటూ వెల్లడిస్తారయ్యా... టామ్ క్రూజ్ కు అపోజిట్ గా 'మేవరిక్ 3'లో రామ్ చరణ్ అని మేం వింటాం'' అంటూ రాజ్‌దీప్ సర్ దేశాయి వ్యాఖ్యానించారు. ''మా అమ్మ ఎప్పుడూ దిష్టి తగలకూడదని చెబుతుంది. ప్రతిభకు ప్రశంశలు లభించే ప్రతి ఇండస్ట్రీలో పని చేయాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా హాలీవుడ్ సినిమా చేయాలని కోరుకుంటున్నా'' అని చరణ్ తెలిపారు.
Also Read : ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా - రామ్ చరణ్
ఢిల్లీలో శుక్రవారం రామ్ చరణ్ బిజీ బిజీగా గడిపారు. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. చరణ్ వచ్చే వరకు భారీ సంఖ్యలో అభిమానులు బేగం పేట్ ఎయిర్ పోర్టు దగ్గర వెయిట్ చేశారు.
Also Read : రామ్ చరణ్‌కు అమిత్ షా సత్కారం - ఇండియన్ సినిమా లెజెండ్ చిరంజీవి అంటూ...