Rakshit Atluri: శివాజీ చెప్పిన విషయంలో తప్పేముంది? ఓపెన్‌గా సపోర్ట్ చేసిన యంగ్ హీరో రక్షిత్ అట్లూరి
Actor Shivaji Controversy: నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ ఆయన ఇచ్చిన వివరణ మీద చిన్మయి, అనసూయ, పాయల్ సహా కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో శివాజీకి ఓపెన్ సపోర్ట్ ఇచ్చారు రక్షిత్ అట్లూరి.

'దండోరా' (Dhandoraa) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ (Actor Shivaji) చేసిన కామెంట్స్ వైరల్ కావడం, ఆయనపై చిన్మయి - అనసూయ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిన విషయాలే. తన స్పీచ్‌లో రెండు అమర్యాదకరమైన పదాలు ఉన్నాయని, తన నోటి నుంచి ఆ రెండూ (సామాను, దరిద్రపు ము***) దొర్లినందుకు క్షమించమని శివాజీ మహిళా సమాజాన్ని కోరారు. ఆయన వివరణతో చిన్మయి, అనసూయ సహా మహిళలు చాలా మంది సంతృప్తి చెందలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూలో శివాజీకి ఓపెన్ సపోర్ట్ ఇచ్చారు రక్షిత్ అట్లూరి.
శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముంది?
శివాజీ గారు రెండు పదాలు తప్పుగా మాట్లాడారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పారని, అయితే ఆయన చెప్పిన కంటెంట్ (విషయంలో) ఎటువంటి తప్పు లేదని యంగ్ హీరో రక్షిత్ అట్లూరి అన్నారు.
'పలాస 1978'తో కథానాయకుడిగా రక్షిత్ అట్లూరి భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల 'శశివదనే' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. శివాజీ అంశంలో ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది స్పందించారు. అందులో మెజారిటీ స్పందనలు ఆయన ఆ విధంగా మాట్లాడటం తప్పని చెప్పారు. ఈ వివాదంలో శివాజీకి బహిరంగంగా మద్దతు ఇచ్చింది రక్షిత్ అట్లూరియే.
''శివాజీ గారు చెప్పిన మాటల్లో యదార్థం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలా హడావుడి చేస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో నాకు ఏమీ తప్పు అనిపించలేదు. సమంత గారు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్నా ఏదో జరిగిందని కొందరు చెబుతున్నారు. సంప్రదాయబద్ధంగా డ్రస్ వేసుకున్నా ఆ విధంగా జరుగుతుంటే... మనం ఎటువంటి సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. మనం ఆడవాళ్లను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాం. మన పిల్లల్ని గానీ, అక్కాచెల్లెళ్లును గానీ ఎంతో బాధ్యతగా, ప్రేమగా చూసుకుంటాం. ఇటువంటి సమాజంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి'' అని రక్షిత్ అట్లూరి ఓ వీడియో విడుదల చేశారు.
View this post on Instagram
అబ్బాయిలకు చెప్పాలి... కానీ!
మహిళలు సంప్రదాయబద్ధంగా చీరలు ధరించినా అఘాయిత్యాలు ఆగడం లేదని, ఈ విషయంలో అబ్బాయిలకు ఏమీ చెప్పారా? అని శివాజీ కామెంట్స్ తర్వాత ఓ ప్రశ్న వచ్చింది. ఆ అంశం మీద రక్షిత్ అట్లూరి మాట్లాడారు. ''మన సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు. తప్పకుండా అబ్బాయిలకు కూడా చెప్పాలి... ఎలా ఉండాలి? మహిళలను ఎలా చూడాలి? అని. అదే విధంగా ఆడ పిల్లలకు కూడా జాగ్రత్త చెప్పాలి. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడ పిల్లలు తక్కువా? ఎక్కువా? అని కాదు. మహిళలు చాలా గొప్పోళ్ళు. మగవాళ్ళగా మన బాధ్యత వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్ట్ చేయడం గురించి శివాజీ గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. ఇది ఆ అభిప్రాయం మాత్రమే'' అని రక్షిత్ అట్లూరి తెలిపారు. శివాజీ వాడిన పదాలు తప్పు గానీ ఆయన చెప్పిన కంటెంట్ తనకు కరెక్ట్ అనిపించిందని రక్షిత్ తెలిపారు.





















