Vrusshabha Movie Review - 'వృషభ' రివ్యూ: 'మగధీర' లాంటి కథతో మోహన్ లాల్ సినిమా... పునర్జన్మల కాన్సెప్ట్‌తో హిట్ వచ్చేనా?
Vrusshabha Review In Telugu: మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వం వహించారు. పునర్జన్మల నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
నందకిశోర్
మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్, గరుడ రామ్ తదితరులు
Mohan Lal's Vrusshabha Movie Review In Telugu: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా... సమర్జీత్ లంకేష్, నయన్ సారిక జంటగా నటించిన సినిమా 'వృషభ'. నంద కిషోర్ దర్శకత్వం వహించారు.'మగధీర' తరహాలో పునర్జన్మల నేపథ్యంలో కథతో తెరకెక్కిన చిత్రమిది. రాజా విజయేంద్ర వృషభగా మోహన్ లాల్ ఎలా నటించారు? సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Vrusshabha Movie Story): ఆదిదేవ వర్మ (మోహన్ లాల్) పెద్ద వ్యాపారవేత్త. ఆయన మీద ఈగ కూడా వాలనివ్వడు కుమారుడు తేజ్ (సమర్జీత్ లంకేష్). తండ్రి అంటే కొడుక్కి అంత ప్రేమ. ఆది దేవకు కలలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు వస్తాయి. ఆ రహస్యాన్ని చెందించాలని దామిని (నయన్ సారిక)తో కలిసి వైద్యులు, స్మశానంలో పూజలు చేసే రుద్ర వరాహ (అయ్యప్ప శర్మ)ను కలుస్తాడు తేజ్. ఆ తర్వాత దేవనగరి వెళతాడు.
దేవనగరి ఆదిదేవ వర్మ సొంతూరు. అక్కడకు వెళ్లిన తర్వాత తేజ్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఏకంగా తండ్రిపై హత్యాయత్నం చేస్తాడు. ఎందుకు? ఆదిదేవ్, తేజ్ గత జన్మలో ఏం జరిగింది?
త్రిలింగ సామ్రాజ్యాధినేత రాజా విజయేంద్ర వృషభ (మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టిన శాపం ఏమిటి? ఆయన భార్య, మహారాణి త్రిలోచన (రాగిణీ ద్వివేది) మరణానికి కారణం ఎవరు? పునర్జన్మలో మళ్ళీ తండ్రీ కొడుకులుగా జన్మించిన తర్వాత ఏమైంది? చివరకు ఈ కథ ఏ కంచికి చేరింది? అనేది సినిమా.
విశ్లేషణ (Vrusshabha Telugu Movie Review): పునర్జన్మల నేపథ్యంలో కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. 'మగధీర'కు ముందు, తర్వాత చాలా చూశారు. భారతీయ తెరపై విజయవంతమైన ఫార్ములా కూడా! దాన్ని ఫాలో అవుతూ దర్శకుడు నందకిషోర్ 'వృషభ' తీశారు. సక్సెస్ ఫుల్ ఫార్ములా అయితే సెలెక్ట్ చేసుకున్నారు కానీ... సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్ మాత్రం రాయలేదు.
పునర్జన్మలు, అందులోనూ రాజ్యాలు - రాజులు కథ అంటే మరణం - ప్రతీకారం తప్పకుండా ఉంటుంది. ఎవరు ఎవరి వల్ల మరణించారు? మరుజన్మలో ఎవరు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? దర్శకుడు దాన్ని ఎలా చూపించాడు? అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుంది. 'వృషభ' కథలో పాయింట్ కొత్తది. తండ్రి మీద కొడుకు కత్తి ఎత్తడం, ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం ఆసక్తి కలిగించే అంశం. కానీ దర్శకుడు నందకిషోర్ మొదటి నుంచి డిస్ కనెక్ట్ అయ్యేలా తీశారు.
మంచి పాయింట్ ఎంపిక చేసుకోవడం ముఖ్యం కాదని, అంత కంటే మంచి సీన్లు - డైలాగులు రాసుకోవడం ముఖ్యమని 'వృషభ' వంటి సినిమాలను చూసినప్పుడు అర్థం అవుతుంది. ఇంటర్వెల్ వరకు సన్నివేశంతో సంబంధం లేకుండా భారీ డైలాగులు చెబుతారు ఒక్కొక్కరు. వాటిని పక్కన పెట్టినా... తెలుగులో కొన్ని వందల సినిమాల్లో చూసిన సన్నివేశాలు వస్తుంటాయి. అయ్యప్ప శర్మ సన్నివేశాలు కాస్త కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. త్రిలింగ రాజ్యం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదు. కానీ ప్రజెంట్ టైంలో హీరో మీద సొంతూరిలో ఒకరు చంపేంత పగతో ఉండటానికి చూపించిన కారణం, అదీ ఊరు వచ్చినప్పుడు చంపుతానని చెప్పడం మరీ సిల్లీగా ఉంది.
'వృషభ'కు పదిమంది నిర్మాతలు ఉన్నారు. నిర్మాణ నిర్వహణ బాధ్యతలు, మూవీ క్వాలిటీ చెకింగ్ ఎవరు చూశారో గానీ... మోహన్ లాల్ హార్స్ రైడింగ్ సీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే 'వీరమల్లు' గుర్తుకు వస్తుంది. 'ఆచార్య' కోసం వేసిన సెట్‌లో యుద్ధ క్షేత్రం సన్నివేశాలు తీశారు. విగ్రహాలకు రంగులు లేవు గానీ త్రిలింగ రాజ్యం అని 'ఆచార్య' సెట్ చూపిస్తే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అసలు నమ్మాలని అనిపించదు. ప్రేక్షకులు సగం ఇంట్రెస్ట్ చచ్చిపోవడానికి కారణం మేకింగ్ క్వాలిటీ. టెక్నికల్ పరంగా సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. సామ్ సిఎస్ అందించిన పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ గుర్తుంచుకునేలా లేవు.
Also Read: 'ఛాంపియన్' రివ్యూ: బైరాన్‌పల్లి తిరుగుబాటులో ఫుట్‌బాలర్... రోషన్ సినిమా ఎలా ఉందంటే?
'వృషభ' చూస్తున్నంత సేపూ మోహన్ లాల్ ఈ రోల్ చేయడానికి ఎందుకు 'ఎస్' చెప్పారు? అనే సందేహం కలుగుతుంది. ఆయన్ను మహారాజుగా చూపించారు. అందులో మరో సందేహం అవసరం లేదు. కానీ, ఆయన స్థాయికి తగ్గ సన్నివేశాలు లేవు. ఇంటర్వెల్ ముందు వరకు మరీ తండ్రి పాత్రకు పరిమితం చేసి సమర్జీత్ లంకేష్ (Samarjit Lankesh)కు యంగ్ స్టార్ హీరోల రీతిలో బిల్డప్ ఇవ్వడం తెలుగు ప్రేక్షకులు చూడటం కష్టమే. తనకు అవకాశం కుదిరినప్పుడు మోహన్ లాల్ మంచి నటన కనబరిచారు. సమర్జీత్ లంకేష్ అప్పియరెన్స్ బావుంది. నటనలో కాస్త ఇంప్రూవ్ అవ్వాలి.
రాగిణీ ద్వివేది తెరపై కనిపించినది తక్కువ సేపు అయినా మంచి పాత్ర చేశారు. నయన్ సారికది రెగ్యులర్ కమర్షియల్ రోల్. అజయ్, వినయ్ వర్మ, భద్రమ్, 'బలగం' సంజయ్... తెలుగు - మలయాళ బైలింగ్వల్ కావడంతో తెలుగు ఆర్టిస్టులు చాలా మంది కనిపిస్తారు. అయితే ఎవరికీ సరైన క్యారెక్టర్ పడలేదు.
మోహన్ లాల్ కోసం 'వృషభ'కు వెళితే డిజప్పాయింట్ కావడం గ్యారెంటీ. రాజులు - యుద్ధాలతో పునర్జన్మల నేపథ్యంలో కథ అంటే ఇంట్రెస్ట్ చూపించే ఆడియన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళను కూడా డిజప్పాయింట్ చేస్తుందీ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం - మానసిక సంఘర్షణ కాన్సెప్ట్ బావుంది. కానీ దర్శకుడు నందకిషోర్ తెరకెక్కించడంలో సక్సెస్ కాలేదు. థియేటర్లలో చివరి వరకు కూర్చోవడం కష్టమే.





















