Rajendra Prasad: వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి?
ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నటకిరీటి రాజేంద్రప్రసాద్, ఇప్పుడు ఊహించని విధంగా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. తాజాగా ఆయన ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కారణమవుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు హీరోగా తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్ ఇప్పటికీ తన మ్యానరిజమ్స్‌తో అలరిస్తూనే ఉన్నారు. అవకాశాలు పట్టేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి కాంట్రవర్సీ లేదంటే, ఎంత గొప్పగా తన కెరీర్‌ని బిల్డ్ చేసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే ఈ రాజేంద్రుడు.. తాజాగా ఆయన నటించిన ‘హరికథ’ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్.. ఆయనని వార్తలలో పెట్టేశాయి. ఆయన క్యాజువల్‌గా అన్నా.. కావాలనే అన్నట్లుగా ప్రొజక్ట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అన్నటువంటి వ్యాఖ్యలు ‘పుష్ప’ హీరోని ఉద్దేశించే అనేలా ఏంటి? అన్నది ‘పుష్ప’ హీరోనే. అందులో డౌటనుమానం అస్సలు అవసరమే లేదు. ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఏమన్నారంటే...
‘‘త్రేతా యుగం తర్వాత ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో కథలు ఎలా ఉంటున్నాయో అంతా చూస్తూనే ఉన్నారు. నిన్నకాక మొన్నే చూశాం. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో. సరేలే.. ఇప్పుడు హీరోల మీనింగ్సే మారిపోయాయి. నా అదృష్టం ఏంటంటే... దాదాపు 48 ఏళ్లుగా నేనొక వైవిధ్యమైన హీరోనే. నాది 48 ఏళ్ల సినీ ప్రస్థానం. ఇంతకాలం నటుడిగా కొనసాగడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు కూడా ఎంతో మంది హీరోలతో కలిసి నటిస్తున్నాను అంటే అది నాకు దక్కిన గౌరవం’’ అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన ఇప్పుడు మాట్లాడింది ‘పుష్ప’ హీరో గురించి మాత్రమే. అల్లు అర్జున్ గురించి మాత్రం కానే కాదు. ఈ విషయం తెలియక అల్లు అర్జున్ అభిమానులు నటకిరీటిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నిన్న కాక మొన్న చూశాం, ఎర్రచందనం దొంగ వాడు హీరో - Senior Actor #RajendraPrasad garu pic.twitter.com/hsk4OjXZ4i
— At Theatres (@AtTheatres) December 9, 2024
ఇప్పుడు హీరో స్వరూపం ఇలా మారిపోయిందని చెప్పడం ఇక్కడ రాజేంద్రప్రసాద్ ఉద్దేశం అంతే తప్పితే... అల్లు అర్జున్ దొంగ అని ఆయన అనలేదు. ఇప్పుడు అందరూ హీరోలే అనేది ఆయన మాటలకి అర్థం. ఇక అంత వరకు వస్తే.. ఈ మాట రాజేంద్రప్రసాద్ మాత్రమే కాదు.. ఈ మధ్య చాలా మంది సినీయర్ నటులు ‘పుష్ప’ హీరో క్యారెక్టర్‌పై ఇలాగే స్పందించారు. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ‘పుష్ప’ హీరో పాత్రపై ఇలానే మాట్లాడారు. అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. కేవలం పాత్రని మాత్రమే వారు విమర్శించారు. ఇది బన్నీ అభిమానులు తెలుసుకోవాల్సి ఉంది.
అయినా అల్లు అర్జున్‌ని రాజేంద్రప్రసాద్ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ‘పుష్ప’ సినిమాలో లేడు కానీ.. అంతకు ముందు అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఎలాంటి పాత్రలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్‌ల బాండింగ్ ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో రాజేంద్రప్రసాద్‌ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హీరో పాత్ర అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలా స్మగ్లింగ్ చేసే పాత్రలలో హీరోలని చూపిస్తే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అనేది సామాన్య జనం అభిప్రాయం కూడా.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?