Chiranjeevi Remake Movies: మెగాస్టార్ కాస్తా రీమేక్ స్టార్‌గా మారిపోతున్నారా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలను చేస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150', 'గాడ్ ఫాదర్', 'బోలా శంకర్' ఇవన్నీ రీమేక్ సినిమాలే. ఇప్పుడు తాజాగా మరో మలయాళ రీమేక్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమారు 155 కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మెగాస్టార్ తన రీఎంట్రీ తర్వాత ఎక్కువగా రీమేక్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణాలు ఏవైనా మెగాస్టార్ ఇలా వరుస రీమేక్ సినిమాలు చేస్తుండడంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు దశాబ్ద కాలం సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమాతో వెండి తెరకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. 2017 సంవత్సరంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళ హీరో దళపతి విజయ్ 'ఖైదీ' మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాని మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది.
ఇక ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో 'గాడ్ ఫాదర్' సినిమా మలయాళం లో మోహన్ లాల్ నటించిన గాడ్ ఫాదర్ కి రీమేక్ గా తెరకెక్కింది. మోహన్ రాజా ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. ఇక తాజాగా చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్' సినిమా కూడా తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మెహర్ రమేష్ ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'బ్రో డాడీ' సినిమాని రీమేక్ చేయబోతున్నారట చిరంజీవి. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే మెగాస్టార్‌కు ఉన్న పాపులారిటీకి, ఆయన కాలిబర్‌కు ఫ్రెష్ కంటెంట్ పడితే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రికార్డులు తిరగరాస్తుంది. కానీ చిరంజీవి మాత్రం బాక్సాఫీస్ వద్ద రీమేక్ సినిమాలతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ విషయంలో ఓవర్గం అభిమానులు మెగాస్టార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రీమేక్ చేస్తే కనీసం కొరియన్ సినిమాలైనా చేయాలి. కానీ ఇలా ఇండియన్ మూవీస్ ని రీమేక్ చేయడం ఏంటంటూ మరికొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ అయితే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకోవాలో అది కేవలం మెగాస్టార్ ఛాయిస్ మాత్రమే. అయితే ఆ రీమేక్ లను మంచి ప్రతిభ ఉన్న దర్శకులతో చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక నుంచైనా చిరంజీవి రీమేక్‌ల జోలికి వెళ్లకుండా మంచి మంచి కంటెంట్స్ తో సినిమాలు చేస్తే బాగుంటుందని మెజారిటీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు చిరంజీవి కంటెంట్ ఉన్న కథలను ఓకే చేసి ప్రేక్షకులను అలరిస్తారా? లేక అవే రీమేక్ కథలను ఎంచుకుంటూ రీమేక్ స్టార్ గా మారుతారా? అనేది ముందు ముందు చూడాలి.
Also Read: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు