Sagileti Katha Movie : సెగరేపే సలిమంటల్లా, అట్టా ఎట్టాగా పుట్టేసినావు - రవితేజ సినిమాలో కొత్త పాట
యువ హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో యూట్యూబర్ రవితేజ మహాదాస్యం కథానాయకుడిగా రూపొందిన సినిమా 'సగిలేటి కథ'. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు.
యూట్యూబర్ రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సగిలేటి కథ' (Sagileti Katha Movie). హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించడంతో పాటు ఈ చిత్రానికి రచన, కూర్పు, ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో విషిక కోట కథానాయిక. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మాతలు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో రెండో పాటను నేడు విడుదల చేశారు.
రధన్ విడుదల చేసిన అట్టా ఎట్టాగా!
Sagileti Katha Songs : 'సగిలేటి కథ' సినిమాలో రెండో పాటను యువ సంగీత దర్శకుడు రధన్ విడుదల చేశారు. 'అట్టా ఎట్టాగా...' పాట బావుందని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
''అట్టా ఎట్టాగా పుట్టేసినావు
నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు
సలికాలం సెగరేపే సలిమంటల్లాగా
నాలోన మంటేట్టినావే
ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా
నీదారే నాదంటూ దాహం తీర్చావే''అంటూ సాగిన ఈ గీతాన్ని చిత్ర దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి... ఇద్దరూ కలిసి రాశారు. యశ్వంత్ నాగ్ ('పరేషాన్' మూవీ ఫేమ్), కమల మనోహరి ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు.
Also Read : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
కొన్ని రోజుల క్రితం సినిమాలో తొలి పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. అప్పుడు నిర్మాత దేవి ప్రసాద్ బలివాడ మాట్లాడుతూ ''నేను పుట్టిన సంవత్సరం, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాల్లో వచ్చిన సంవత్సరం ఒక్కటే. నాకు రెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన 'శివ' చిత్రానికి దర్శకత్వం వహించారు. నాకు ఊహ తెలియని వయసులో ఆ సినిమా చూసి డైలాగ్స్ చెప్పా. అప్పట్నుంచి మా పేరెంట్స్ నన్ను ముద్దుగా 'శివ' అని పిలిచేవారు. నాకు తెలియకుండానే ఆర్జీవీ గారు నా చిన్నప్పటి నుంచి నన్ను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. నేను సినిమాల్లోకి రావడానికి ఒక బీజం నాటారు. నేను నిర్మించిన 'కనుబడుటలేదు' నుంచి ఈ 'సగిలేటి కథ' వరకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మా చిత్రాలకు ఆయన సహాయం చేస్తున్నారు'' అని చెప్పారు.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
'కనబడుటలేదు' తర్వాత షేడ్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఎలా అయితే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారో... ఈ సినిమాలోనూ అదే విధంగా కొత్త తారలకు అవకాశం ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షేడ్ స్టూడియోస్ సంస్థ తెలిపింది.
'సగిలేటి కథ' సినిమాలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలు రాజశేఖర్ సుద్ మూన్ చూసుకున్నారు. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నరేష్ బాబు మాదినేని, స్వరాలు : జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్, సాహిత్యం : వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial