Lavanya on Varun Tej: పెళ్లి గురించి అడగొద్దు - వరుణ్ తేజ్‌తో రిలేషన్‌పై లావణ్య త్రిపాఠి క్లారిటి
లావణ్య త్రిపాఠి ఇన్స్టా లైవ్ లో మాట్లాడుతూ వరుణ్ తేజ్‌తో తన రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పెళ్లి గురించి అడగొద్దని చెప్పింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉందంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అలరించిన వీళ్లిద్దరూ.. ఆఫ్ స్క్రీన్ లోనూ సన్నిహితంగా మెలగడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇంత వరకూ ఈ అంశంపై వీరిద్దరూ నోరు మెదపలేదు. దీంతో వరుణ్ - లావణ్య ప్రేమాయణం వార్తలకు బ్రేక్స్ పడటం లేదు.
లావణ్య త్రిపాఠి నటించిన 'పులి మేక' వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, తాజాగా ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించింది. లైవ్ లో ఆమెను తెలుగులో మాట్లాడాలని నెటిజన్లు ఒత్తిడి చేయడంతో.. లావణ్య తనకు తెలిసిన తెలుగులోనే మాట్లాడుతూ, అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ తో రిలేషన్ షిప్ కు సంబంధించిన ప్రశ్నలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాకపోతే రిలేషన్ షిప్ లో ఉన్నారా? అనే ప్రశ్నకు లావణ్య తెలివిగా సమాధానం చెప్పింది. అమ్మ, నాన్న కూడా రిలేషన్ షిప్ కాదా? అని ప్రశ్నించింది. పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తుంటే.. దాని గురించి అడగొద్దని చెప్పింది. పెళ్లి గురించి అడగొద్దు.. పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నారు? కొన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతీ హీరోయిన్‌ను ఈ ప్రశ్న ఎందుకు వేస్తారు? అని ఎదురు ప్రశ్నించింది. ఇండస్ట్రీలో మీకు ప్రెండ్స్ ఎవరు? అని అడగ్గా.. నిహారిక, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అంటూ పలువురు పేర్లు చెప్పింది లావణ్య.
ఇటీవల 'పులి మేక' వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విలేకరులతో మాట్లాడిన లావణ్య త్రిపాఠి.. ఏ హీరోలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారనే ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా వరుణ్ తేజ్ పేరు చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య బంధం గురించి పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం అయ్యాయి. వరుణ్ - లావణ్య ప్రేమలో ఉన్నారని విస్తృతంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ముద్దుగుమ్మ సమాధానంతో వీరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది.
ఇకపోతే 'మిస్టర్' సినిమాలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత 'అంతరిక్షం 9000 కేఎంపీహెచ్' చిత్రంలోనూ ఈ జంట రొమాన్స్ చేసారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం అందిస్తున్నట్లుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో తరచుగా ఒకరినొకరు లైక్ చేసుకోవడం, పోస్టులకు కామెంట్స్ పెట్టుకోవడం.. మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లికి లావణ్య హాజరవడం.. ఇలాంటివి ఈ వార్తలకు ఆజ్యం పోశాయని చెప్పాలి.
మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో తనయుడు పెళ్లి పీటలెక్కుతాడని స్పష్టం చేశారు. అతడికి కాబోయే భార్య వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. కానీ లావణ్య త్రిపాఠి తాజాగా తన రిలేషన్ షిప్ - పెళ్లికి సంబంధించిన ప్రశ్నలను దాటవేయడంతో మరికొన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించినట్లయింది. మరి త్వరలోనే అన్నింటికీ స్ట్రెయిట్ గా సమాధానం చెప్పి, రూమర్స్ కు చెక్ పెడుతుందేమో చూడాలి.
Read Also: పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ చూసి ఓటేయరు - రోజాకు అదే బలం: సీనియర్ నటి కస్తూరీ కామెంట్స్