Kona Venkat: నిరాహారదీక్ష చేసైనా ఎన్‌టీఆర్‌ను ఒప్పిస్తా, ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎవరి వల్ల కాదు - కోన వెంకట్
Kona Venkat: రైటర్ కోన వెంకట్ రాసిన కామెడీ కథల్లో ‘అదుర్స్’ కూడా ఒకటి. దానికి ఎప్పటికైనా సీక్వెల్ తీస్తానని, ఎలా అని ఎన్‌టీఆర్‌ను ఒప్పిస్తానని తాజాగా ఫ్యాన్స్‌కు మాటిచ్చారు కోన వెంకట్.
Kona Venkat about Adhurs 2: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. అందుకే చాలా ఏళ్ల క్రితం విడుదలయ్యి హిట్ అయిన సినిమాలకు కూడా ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2014లో విడుదలయిన హారర్ కామెడీ ‘గీతాంజలి’కి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. త్వరలోనే ఇది థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మూవీ టీమ్ అంతా ఒక స్పెషల్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అందులో రైటర్ కోన వెంకట్‌తో పాటు అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్.. కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వెంకీ’కి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని కోన వెంకట్‌ను ప్రశ్నించగా.. ‘అదుర్స్’ సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నామని ఆసక్తికర విషయం బయటపెట్టారు.
ఇండియాలోనే ఎవరి వల్ల కాదు..
‘‘అదుర్స్ సీక్వెల్ ఫిక్స్. పక్కా. అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి, పిలక పెట్టుకొని నిరాహారదీక్ష చేసి అయినా సరే అదుర్స్ 2 తారక్‌తో చేయిస్తా. తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అది. తనను మించి ఆ పాత్ర చేసేవాడే లేడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనే ఆ క్యారెక్టర్, ఆ డ్రెస్సింగ్, ఆ మాడ్యులేషన్‌లో ఎన్‌టీఆర్ ఆ క్యారెక్టర్‌ను చేసే నటుడు ఇండియాలోనే లేడు. వినాయక్‌తోనే అదుర్స్ 2 చేస్తా. నేను చేసిన ఎక్కువశాతం సినిమాల్లో టాప్ డైరెక్టర్స్‌తో శ్రీను వైట్ల, వినాయక్ కామెడీ బాగా చేస్తారు. వినాయక్‌కు కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు’’ అని ‘అదుర్స్ 2’ గురించి చెప్పుకొచ్చారు కోన వెంకట్.
తారక్‌కు సెట్ అయ్యింది..
కోన వెంకట్ చేసిన ఈ ప్రకటన.. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచేస్తోంది. ఎన్‌టీఆర్ కెరీర్‌లో ‘అదుర్స్’లో చేసినంత కామెడీ ఇంకా ఏ ఇతర చిత్రాల్లో చేయలేదని ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అందులో ఒక పంతులు పాత్రలో తారక్ జీవించేశారని అంటుంటారు. ఎన్‌టీఆర్ తర్వాత పలువురు హీరోలు బ్రాహ్మణ పాత్రలు పోషించినా.. అది తారక్‌కు మాత్రమే బాగా సెట్ అయ్యిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి ఇప్పుడు అదే పాత్రలో మళ్లీ కామెడీ చేయడానికి ఎన్‌టీఆర్ సిద్ధమయ్యాడంటే ఫ్యాన్స్‌కు అది కచ్చితంగా గ్రేట్ న్యూస్ అవుతుంది. ప్రస్తుతం ఈ హీరోకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ‘అదుర్స్ 2’ కష్టమే అని కొందరు భావించినా.. కోన వెంకట్ మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారని, కచ్చితంగా చేస్తారేమో అని అనుకుంటున్నారు.
కాంబినేషన్ అదుర్స్..
2010లో వివి వినాయక్ దర్శకత్వంలో ‘అదుర్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అదుర్స్’ పేరు చెప్పగానే ముందుగా ఆడియన్స్‌కు గుర్తువచ్చేది ఎన్‌టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్. ఈ మూవీలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్, ఆ కామెడీ విపరీతంగా హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌లో కామెడీ చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బ్రహ్మానందం అలాంటి పూర్తిస్థాయి కామెడీ రోల్స్ చేసి చాలాకాలం అయ్యింది కాబట్టి మరోసారి అలాంటి పంతులు పాత్రలో ఎన్‌టీఆర్‌తో కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోన వెంకట్.. ‘అదుర్స్ 2’ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.