Keerthy Suresh Bollywood Debut : బాలీవుడ్‌కు మహానటి కీర్తీ సురేష్ - హీరో ఎవరంటే?
Keerthy Suresh paired opposite Varun Dhawan In VD18 : మహానటి కీర్తీ సురేష్ హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరోకి జోడీగా ఆమె నటించనున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ... సౌత్ సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన పూజా హెగ్డే, రష్మికా మందన్న ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే హిందీలో సెటిల్ అయినట్లు కనబడుతోంది. చాలా సంవత్సరాలుగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న నయనతార షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు కీర్తీ సురేష్ వంతు వచ్చింది. మన మహానటి సైతం ఇప్పుడు హిందీకి వెళుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వరుణ్ ధావన్ జోడీగా కీర్తీ సురేష్!
నయనతారను హిందీకి తీసుకు వెళుతున్న తమిళ దర్శకుడు అట్లీయే... కీర్తీ సురేష్ (Keerthy Suresh)ను కూడా బాలీవుడ్ ఫిల్మ్ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. అయితే... ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. హిందీకి నయనతార కథానాయికగా పరిచయం అవుతున్న 'జవాన్'కు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తీ సురేష్ తొలి హిందీ చిత్రానికి ఆయన దర్శకుడు కాదు, కేవలం సమర్పకుడు మాత్రమే.
అట్లీ సమర్పణలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి కలీస్ (Kalees) దర్శకుడు. ఆయనదీ కోలీవుడ్డే. ఆయనకూ ఇది తొలి హిందీ సినిమా. దర్శకుడిగా అయితే రెండోది. ఇంతకు ముందు తమిళంలో జీవా, నిక్కి గర్లానీ జంటగా 'కీ' సినిమా తీశారు.
వరుణ్ ధావన్ హీరోగా కలీస్ దర్శకత్వం వహించనున్న సినిమాతో కీర్తీ సురేష్ హిందీ చిత్రసీమకు కథానాయికగా పరిచయం కానున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మరో కథనాయికకు కూడా చోటు ఉందట. ఆమె ఎవరనేది త్వరలో తెలుస్తుంది. వచ్చే ఏడాది మే 31న ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది.
Also Read : మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల - నితిన్ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా!
'మహానటి'తో ఉత్తమ నటిగా కీర్తీ సురేష్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ సినిమా కంటే ముందు 'నేను శైలజ', 'నేను లోకల్'తో తెలుగు విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత 'సర్కారు వారి పాట', 'దసరా' సినిమాలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. కీర్తీకి ముందు నుంచి హిందీ అవకాశాలు వచ్చాయి. అయితే... సరైన కథ కోసం వేచి చూశారు. వరుణ్ ధావన్ సినిమాలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో ఓకే చెప్పారట.
'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలిగా...
'నాయకుడు'లో ఉదయనిధి స్టాలిన్ సరసన కీర్తీ సురేష్ నటించారు. తెలుగు ఈ నెల 14న, తమిళంలో జూన్ 29న 'మామన్నన్'గా విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు, వసూళ్లు బావున్నాయి. వచ్చే నెలలో స్ట్రెయిట్ తెలుగు సినిమాతో కీర్తీ సురేష్ సందడి చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ తెరకెక్కించిన స్టయిలిష్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. అందులో చిరంజీవి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా... చిరు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఆమె జోడీగా సుశాంత్ కనిపించనున్నారు. ఇది కాకుండా ప్రస్తుతం కీర్తీ సురేష్ చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. అందులో 'రఘు తాత' ఒకటి. 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'కాంతార' చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులలో తమకంటూ గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది.
Also Read : కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుడు జగన్ - ఇదీ వర్మ 'వ్యూహం'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial